తిరుమల దేవస్థానంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం
తిరుమల శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా ఖండించింది. శ్రీవారి ఆలయంలో అఖండ ద్వీపం ఆగిపోయిందని స్వామి వారికి నిత్య కైంకర్యాలు జరగడం లేదనే వార్తలు పూర్తిగా అసత్యమని టీటీడీ పేర్కొంది. భక్తులు ఇలాంటి వదంతులను నమ్మవద్దంటూ వివరణ ఇచ్చారు ఆలయ అర్చకులు. అంతేకాదు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. భక్తుల మనోభావాలు డీబాతీసే విధంగా ఇలాంటి వదంతులు రావడం శోచనీయమని అన్నారు. శ్రీవారి ఆలయంలో అన్ని సేవలు ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని శఠగోప రాజానుజ పెద్దజీయర్ స్వామి తెలిపారు.
ఈ మేరకు వదంతులపై వివరణ ఇస్తూ టీటీడీ కార్యనిర్వహణాధికారి లేఖ రాశారు. సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకూ నిర్ధేశించిన సమయం ప్రకారమే స్వామి వారికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయని అన్నారు. అంతేకాదు శ్రీవారికి శాస్త్రం ప్రకారం నైవేద్యం సమర్పణ జరుగుతోందని అన్నారు. ఆలయంలో దీపం కొండెక్కిందన్నది దుష్ప్రచారమే అని జీయంగార్లు స్పష్టం చేశారు. గర్భాలయంలోని అఖండదీపాలను జాగ్రత్తగా చూస్తున్నారని అన్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి పూర్తిగా పోతుందని అన్నారు. త్వరలోనే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com