కరోనాను జయించిన వృద్ద దంపతులు

దేశంలో ఒకవైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతుండగా.. మరొవైపు బాధితుల్లో కొందరు కోలుకుంటున్నారు. కరోనా మహమ్మారిని జయించిన వారిలో కేరళకు చెందిన 93 ఏళ్ల వృద్ధుడు, 88 ఏళ్ల వయసు గల ఆయన భార్య కూడా ఉన్నారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే కే శైలజ వెల్లడించారు. ఆ వృద్ద దంపతులకు డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఇతర వయోభార సమస్యలున్నా వైరస్ నుంచి త్వరగా కోలుకున్నారని ఆమె తెలిపారు.
కేరళలోని పథనంతిట్టా జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన ఈ వృద్ద దంపతుల కుమారుడు, కోడలు, వారి పిల్లలు ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి తిరిగొచ్చారు. అప్పటికే వారు వైరస్ బారినపడటంతో ఇతర కుటుంబ సభ్యులకు వ్యాపించింది. అయితే వీరికి వైరస్ సోకినట్టు మార్చి 8న నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉంచి చికిత్స అందించారు. డాక్టర్లు ఇచ్చిన సలహాలు క్రమం తప్పకుండా వృద్ద దంపతులు పాటించడంతో ప్రాణాప్రాయం నుంచి బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మానసికంగా ధృడంగా ఉంటే ఎంతటి మహమ్మారినైనా ఎదిరించవచ్చని వృద్ద దంపతులు నిజం చేసి చూపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com