ఇంటింటికి ఉచితంగా పాల ప్యాకెట్లు పంచిపెట్టిన సీఎం

కరోనా వైరస్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర సర్కార్ దేశంలో లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పట్ణణ ప్రాంత పేదలకు చేయూతను అందించడం కోసం కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పేదలకు ఉచితంగా పాలు పంచిపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం ఉదయం బెంగళూరులోని అశ్వత్ నగర్‌లో తన చేతుల మీదుగా ఉచిత పాల పంపిణీ కార్యక్రామాన్ని ప్రారంభించారు.
కార్యక్రమం ప్రారంభం అనంతరం యడ్యూరప్ప బెంగళూరులోని అశ్వత్‌నగర్ ఏరియాలో గల్లీగల్లీ తిరుగుతూ ఇంటింటికి ఉచితంగా పాల ప్యాకెట్లు పంచిపెట్టారు. లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, మురికవాడలలో నివాసం ఉంటున్న పేదలకు ఉచితంగా పాలు పంపిణి చెయ్యాలని, ఆ పాలుకు ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందని ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 69 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, అందులో 42 లక్షల లీటర్ల పాలను ప్రభుత్వమే పాడి రైతుల నుంచి కొనుగోలు చేసి ఉచితంగా పట్టణ ప్రాంతాల పేదలకు పంపిణీ చేస్తుందని చెప్పారు. యడియూరప్ప తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com