నాగ్‌పూర్ నుంచి తమిళనాడు ప్రయాణిస్తూ.. హైదరాబాద్‌లో మృతి

బ్రతుకుదెరువు కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కిలోమీటర్లు వలస వెళ్ళాడు..
23 ఏళ్లకే కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు.. కానీ కరోనా వైరస్ అతని జీవితాన్ని బలితీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న తరుణంలో 500 కిలోమీటర్లు నడిచి చివరకు కుప్పకూలాడు. ఈ హృదయ విదారక ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన లోగేష్ బాల సుబ్రహ్మణ్యం ఉపాధి నిమిత్తం నాగపూర్‌కు వలస వెళ్లాడు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే కరోనా వైరస్ అతని జీవితంలో కల్లోలం సృష్టించింది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పనిలేక, తినడానికి ఆహరం లేక అక్కడ ఉండలేక పొట్టచేతపట్టుకుని కాలిబాటన తమిళనాడుకు బయలు దేరాడు. మూడు రోజుల పాటు నిర్విరామంగా నడిచాడు సుమారు 500 కిలోమీటర్లు నడిచిన అనంతరం సికింద్రాబాద్ చేరుకున్నాడు.. దీంతో తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. ఇంతలో తోటి కార్మికులు అతన్ని వసతి గృహంలోకి తరలించగా అక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. మృతదేహాన్ని తమిళనాడుకు పంపించే ఏర్పాటు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com