సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరో లేఖ
సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరో లేఖ రాశారు. పార్టీ పొల్యూట్ బ్యూరో తీర్మానించిన 14 అంశాలను ప్రభుత్వం పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో కరోనా స్వల్ప కాలంలోనే మూడో దశకు చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని.. మొదటి రెండు దశల్లోనే వైరస్ వ్యాప్తిని నిరోధించి ఉంటే ఈ ప్రమాదం వాటిల్లేది కాదని నిపుణులే చెబుతున్నారని లేఖలో పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మొదటినుంచి కరోనా తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు , ఇతర నిపుణులతో చర్చించి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా సరైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. కరోనా విపత్తు తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ను ఈ నెల ఆఖరు వరకూ పొడిగించాలని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. విశాఖ మెడ్ టెక్ జోన్ పై పూర్తి శ్రద్ధ పెట్టి అభివృద్ధి చెయ్యాలని కోరారు. అంతేకాదు కరోనా మృతుల కుటుంబాలకు 25 లక్షల ఆర్ధిక సాయం అందించాలన్నారు.
పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన భవన నిర్మాణ కూలీలు, అసంఘటిత కార్మికుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అంతేకాదు ప్రతి పేద కుటుంబానికి ఐదు వేలు ఆర్ధిక సాయం అందించాలని లేఖలో కోరారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా అనుమానితులను ఉచితంగా టెస్టులు చెయ్యాలని అన్నారు చంద్రబాబు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవ్వాలని లేఖ లో పేర్కొన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా రాజకీయాలు సరికాదని అన్న చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సర్వే చేయడం తగదన్నారు. యూనివర్సిటీల పాలకమండలిలో ఒకే సామాజిక వర్గాల వారిని నియమించడం సరికాదని టీడీపీ అధినేత మండిపడ్డారు. లాక్ డౌన్ ఉన్నా అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com