ఏటీఎం నుంచి రైస్.. ఎంత మంచి ఆలోచన

ఏటీఎం నుంచి రైస్.. ఎంత మంచి ఆలోచన

తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేని నిరుపేదలకు ఏ చిన్న సహాయం దొరికినా ఎంతో ఊరటనిస్తుంది. లాక్డౌన్ వేళ ఇంట్లో కూర్చుంటే రోజు గడవని నిర్భాగ్యులు ఎందరో ఉన్నారు వియత్నాంలో. వారికి ఏటీఎంల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తూ తన సహృదయతను చాటుకుంటున్నారు వ్యాపార వేత్త హోవాంగ్ తువాన్ అన్హ్. ఒక్కొక్కరికి రోజుకి 1 1/2 కిలోల బియ్యం అందేలా చూస్తున్నారు.

కరోనా వైరస్ వలన ఇప్పటి వరకు వియత్నాంలో మరణాలు సంభవించకపోయినా ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్ విధించారు. దీంతో అనేక వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. వేలాది మంది ప్రజలు తాత్కాలికంగా పనుల నుంచి తొలగించబడ్డారు. ఏటిఎం నుంచి ఉచిత రైస్ సహాయాన్ని పొందుతున్న ఓ తల్లి మాట్లాడుతూ ఇప్పుడు తన ముగ్గురు పిల్లలకి తిండి పెట్టగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేసింది.

ఒక్కోసారి మా పొరుగువారు కూడా మిగిలిపోయిన ఆహారాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పింది. తక్షణ అవసరానికి నూడిల్స్ కూడా ఉపయోగపడుతుంటాయని చెప్పింది. ఈ ఉచిత రైస్‌ని ఉపయోగించుకుంటున్న వారిలో ఎక్కువ మంది వీధి వ్యాపారాలు చేసుకునే వారు, హౌస్ కీపింగ్ పని వారు, లాటరీ టికెట్లు అమ్ముకునే వారు ఉంటున్నారు. తినడానికి తిండి అయితే దొరుకుతుంది కానీ అద్దె చెల్లించడానికి మా దగ్గర డబ్బు లేదని వారు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story