ఆన్‌లైన్‌లో భద్రాద్రి రాములోరికి పూజలు.. ముత్యాల తలంబ్రాలు

భద్రాద్రిలో రాములోరి కళ్యాణం ఈ సంవత్సరం నిరాడంబరంగా జరిగింది. కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భక్తులు లేకుండానే భద్రాదిలో కళ్యాణం జరిగిపోతోంది. మిథిలా స్టేడియం లో ఆరుబయట జరిపే కల్యాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆలయ ప్రాకారం లోనే కళ్యాణం జరిపించారు.
ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా ఎవరి ఇంట్లో వారే కల్యాణం వీక్షించారు. అయితే స్వామి వారి తలంబ్రాలను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు పోస్ట్ ద్వారా పంపిస్తున్నట్లు భద్రాద్రి దేవస్థానం వారు ప్రకటించారు.
ఇక భద్రాచలం లో లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు ఆన్‍లైన్లో రామయ్య పూజలను భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. ts.meeseva.telangana.gov.in ద్వారా భక్తులు తమకు కావాల్సిన సేవలను బుక్ చేసుకోవచ్చు. ENDOWMENT-ONLINE SEVA / POOJA BOOKING లో పూజల ధరల వివరాలు ఉంటాయి. స్వామి వారి కల్యాణం మినహా కేశవ, సహస్ర నామార్చనలు, భద్రుడి మండపం, రామయ్యకు గర్భగుడిలో అభిషేకం, లక్ష్మీతాయారు, ఆంజనేయస్వామి, నృసింహస్వామి అభిషేకాలు తదితర పూజలు బుక్ చేసుకోవచ్చు. గోత్రనామాల పేరిట పూజలు చేసి భక్తులకు మెసేజ్ రూపంలో తెలియపరుస్తారు. ఆర్జిత ఆన్‍లైన్ సేవలను భక్తులు ఉపయోగించుకోవాలని దేవస్థానం వారు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com