ఏం కరోనా.. మరీ ఇంత కఠినమా.. తండ్రికి తలకొరివి పెట్టలేని దౌర్భాగ్యం

కరోనాకి కొంచెం కూడా కనికరం లేనట్టుంది. కన్న వారిని కడతేర్చడంతో పాటు కనీసం అంతిమ సంస్కారాలు చేయడానిక్కూడా భయపడే దుస్థితి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శుజల్‌పూర్ నివాసికి పక్షవాతం రావడంతో ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి వైద్యులు కరోనా పరీక్షలు చేయగా ఏప్రిల్ 14న పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. వారం రోజులు చికిత్స పొందినా లాభం లేకపోయింది. దాంతో ఏప్రిల్ 20న అతడు మృతి చెందాడు.
ఆసుపత్రి సిబ్బంది అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. స్థానిక స్మశాన వాటికకు రమ్మని మున్సిపల్ సిబ్బంది వారికి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తీసుకుని అధికారులు శ్మశాన వాటికకు చేరుకున్నారు. మృతుడి భార్య, కొడుకు, బావమరిది వచ్చారు కానీ .. తండ్రికి తల కొరివి పెట్టేందుకు కొడుకు నిరాకరించాడు. అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తామన్నా వినిపించుకోలేదు.
కనీసం తండ్రి మృత దేహం దగ్గరకు కూడా వెళ్లలేదు. తల్లి కూడా కొడుకుని తండ్రి దగ్గరకు వెళ్లనివ్వలేదు. ఒక్కడే కొడుకని అతడికి ఏమైనా అయితే తన బ్రతుకు భారం అవుతుందని ఆమె కన్నీరు మున్నీరైంది. దీంతో చేసేదేమీ లేక తహసీల్దారే ఆ బాధ్యత తీసుకుని పెద్దాయనకు తలకొరివి పెట్టారు. కుటుంబసభ్యులు భయపడినా ఏదో బంధం తహసిల్ధారుని ఆపని చేయనిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com