ఉద్ధవ్ పోస్ట్‌కి ఎసరు.. ముఖ్యమంత్రి పదవి నుంచి..

కరోనా కేసుల విషయంలో ప్రపంచంలో అమెరికా అగ్రస్థానంలో ఉంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ సమస్యతోనే సతమతమవుతున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో సమస్య వచ్చి నెత్తి మీద కూర్చుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే గత ఏడాది నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన ఏ చట్ట సభ నుంచీ ప్రాతినిధ్యం వహించలేదు. దీంతో ఆయనను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగ నామినేట్ చేయాలంటూ కేబినేట్ తీర్మానం చేసింది. ఇచ్చిన గడువు ఈ 28తో ముగుస్తుంది. గవర్నర్ కనుక తన మనసు మార్చుకుని ఉద్ధవ్‌ను నామినేట్ చేయకపోతే ఆయన సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వస్తుంది.
ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి.. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఏదో ఒక చట్ట సభ నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మార్చి 26న తొమ్మది ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఎలక్షన్ కమిషన్ ఆ ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్సీపీ నేత, మంత్రి అజిత్ పవార్ రంగంలోకి దిగి.. గవర్నర్ కోటా నుంచి ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కోరారు. ఆర్టికల్ 171 ప్రకారం అలా నామినేట్ చేయాలంటే సదరు వ్యక్తి ఏదో ఒక సామాజిక, సాహిత్య కళలో నిష్ణాతుడై ఉండాలి. మరి ఉద్ధవ్ ఫక్తు పొలిటికల్ రంగానికి చెందిన వ్యక్తి. ఎమ్మెల్సీగా ఈ నెల 28లోపు నామినేట్ కాకపోతే ఉద్ధవ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్పి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే పదవిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com