అసలేంటీ ప్లాస్మా థెరపీ.. కరోనా నియంత్రణలో దాని పాత్ర ఎంత?

అసలేంటీ ప్లాస్మా థెరపీ.. కరోనా నియంత్రణలో దాని పాత్ర ఎంత?

ఎవరి పని వారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జన జీవనంలోకి నిశ్శబ్ధంగా వచ్చి విప్లవాన్ని సృష్టిస్తోంది కరోనా. ప్రపంచం అంతటినీ ఒక్క తాటి మీద నిలబెట్టి ఆడుకుంటోందీ వైరస్. కరోనా కలకలం సృష్టించి అప్పుడే ఆరు నెలలు కావస్తోంది. ఇంత వరకు మందులు గానీ, వ్యాక్సిన్ గానీ కనుక్కోలేకపోవడంతో కరోనా బాధితులను రక్షించేందుకు చైనా, అమెరికా దేశాలు ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తుండగా, ఇప్పడు భారత్ కూడ అదే దారిలో పయనిస్తోంది. ఈ థెరపీ వల్ల కరోనా పేషెంట్లు కోలుకుంటున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ శనివారం మధ్యాహ్నం తెలిపారు.

మరి ఈ ప్లాస్మా థెరపీ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం..

ఎవరైనా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లైతే అతడి రక్తంలో యాంటీ బాడీస్ ఎక్కువగా ఉన్నట్లు. అలా కోలుకున్న వ్యక్తి నుంచి రక్తం తీసి అందులోని యాంటీ బాడీస్‌ను అదే వైరస్ బారిన పడిన బాధితుడి రక్తంలోకి ఎక్కించడమే ప్లాస్మా థెరపి. యాంటీ బాడీస్‌ను శాస్త్ర పరిభాషలో ఇమ్యునోగ్గోబులిన్ అని, వాడుక భాషలో రోగ నిరోధక శక్తి అని అంటారు. ఈ యాంటీ బాడీస్ మనిషి రక్తంలోని ప్లాస్మా అనే ద్రావకంలో ఉంటాయి. దాత రక్తం నుంచి ప్లాస్మాను తీసుకుని రోగికి ఎక్కిస్తారు. అందుకే దీన్ని ప్లాస్మా థెరపీ అంటున్నారు.

రోగి రక్తంలోకి ఎక్కించిన ప్లాస్మాలోని యాంటీ బాడీస్ శరీరంలోని కణజాలంలోకి ప్రవహించి వైరస్‌తో పోరాడుతుంది. దాంతో వైరస్ క్షీణించి రోగి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.

రక్తం ఇచ్చిన వ్యక్తికి హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ, హెచ్‌ఐవీ లాంటి జబ్బులున్నా, మరే ఇతర వైరస్‌లు ఉన్నా థెరపీ తీసుకున్న రోగులకూ అవి సంక్రమిస్తాయి.

రక్త దాత నుంచి తీసుకున్న ప్లాస్మాలో వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కునే స్థాయిలో యాంటీ బాడిస్ ఉండాలి. అలా లేనట్లైతే ప్లాస్మా థెరపీ తీసుకున్న వ్యక్తికి జబ్బు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికి తగ్గినట్లు కనిపించినా మళ్లీ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉంటుంది.

ఇక ఈ థెరపీ వల్ల రోగికి సహజసిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి నశిస్తుంది. భవిష్యత్తులో ఎదురయ్యే జబ్బులను ఎదుర్కోవడంలో వైఫల్యం కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story