కరోనా కాలం.. రోడ్డు మీద రూ.25 వేలు కనిపించినా చూసీ చూడనట్టే..

కరోనా వైరస్ కొంత చెడు చేసినా చాలా మంచే చేసిందని చెప్పుకోవాల్సి వస్తుంది ఈ ఘటన చూసిన తరువాత. కష్టపడకుండా వచ్చిన సొమ్ముని కాదనుకునేదెవరు. రోడ్డు మీద రూపాయి కనిపించినా వంగి జేబులో వేసుకుంటారు. అలాంటిది 25వేల రూపాయల నోట్ల కట్ట కనిపిస్తే కాదనుకున్నారంటే కరోనా మహత్యం కాక మరేమిటి. బీహార్‌లోని సమర్బ జిల్లాలో గజేంద్ర షా అనే ఒక వ్యాపారస్తుడు బైక్‌పై వెళుతున్నాడు. ఫ్యాంట్ జేబులో పెట్టుకున్న 25 వేల నోట్ల కట్ట జారి పడిపోయింది. అది గమనించుకోకుండా షాపుకి వెళ్లాడు గజేంద్ర.
సరుకులు కొన్న తరువాత డబ్బు కడదామని జేబులో చెయ్యి పెడితే నోట్ల కట్ట కనిపించలేదు. దారిలో పడిపోయిందేమో అని వెంటనే వెనక్కి వెళ్లి చూసుకున్నాడు. అయితే స్థానికులు ఆ డబ్బుని చూసినా తీసుకోకుండా పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు వచ్చి ఆ డబ్బుని స్వాధీనం చేసుకున్నారని స్థానికుల ద్వారా తెలుసుకున్న గజేంద్ర స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ డబ్బు గజేంద్రదే అని నిర్ధారించుకున్న పోలీసులు అతడికి అందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నోట్ల కట్టను ఎవరూ తాకి వుండరని పోలీసులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com