పెళ్లికి పక్కా ప్లాన్.. అంబులెన్స్‌కి కాల్ చేసి మరీ..

పెళ్లికి పక్కా ప్లాన్.. అంబులెన్స్‌కి కాల్ చేసి మరీ..
X

వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నారు ఒకప్పుడు.. ఇప్పుడు ఒక అబద్దం ఆడి పెళ్లి చేస్తే కూడా వెయ్యి మంది క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. కరోనా రోజులు మరి చేసేదేముంది. కష్టకాలం దాపురించి కళ్యాణానికి కూడా అంబులెన్స్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్‌కు చెందిన అహ్మద్‌కు ఢిల్లీకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి తేదీ దగ్గరపడుతోంది. లాక్‌డౌన్ కారణంగా వెళ్లే పరిస్థితి లేదు.

అయినా పెళ్లి కొడుకు, తండ్రి ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం ముజఫర్ నగర్ నుంచి బయల్దేరారు. మార్గమధ్యంలో పోలీసులకు చిక్కడంతో వారిని తిరిగి ఇంటికి పంపించారు. ఈసారి ప్లాన్ పక్కాగా ఉండాలి. పోలీసులకు ఏ మాత్రం చిక్కకూడాదని ఓ బ్రహ్మాండమైనా ఐడియా చేశారు తండ్రీ కొడుకులు. వెంటనే నాన్నకు బాలేదు అంబులెన్స్ కావాలని హాస్పిటల్‌కి కాల్ చేశాడు కొడుకు. అంబులెన్స్ రావడంతో అడ్డుకునే వారే లేరు.

సరాసరి పెళ్లి కూతురు ఇంటికి వెళ్లారు. అనుకున్న సమయానికి పెళ్లి చేశారు. మళ్లీ తిరిగి అదే అంబులెన్స్‌లో ముజఫర్ నగర్ చేరుకున్నారు. అయితే వారు ఉంటున్న ప్రాంతం కోవిడ్ హాట్ స్పాట్‌గా ప్రకటించారు. దీంతో పాటు అహ్మద్ ఇంట్లో జనాలు ఎక్కువగా ఉన్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి కూతురు, పెళ్లి కొడుతో పాటు బంధువులందరికీ కోవిడ్ టెస్ట్ చేసి క్వారంటైన్‌కు తరలించారు.

Tags

Next Story