నగలమ్మిన చోటే కూరలమ్మి కుటుంబాన్ని..

నగలమ్మిన చోటే కూరలమ్మి కుటుంబాన్ని..
X

పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవడం అంటే ఇదేనేమో. కరోనా వైరస్ బతుకుల్ని ఛిధ్రం చేస్తున్నా ఉన్నవాళ్లు బతకాలంటే ఏదో ఒకటి చేయాలి. బంగారం షాపు మూలపడింది. తినడానికి తిండెలా సమకూరుతుందని బంగారం వర్తకుడు కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్నాడు. కరోనా కాలంలో లాక్డౌన్ నడుస్తోంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో పాటు చిరు వ్యాపార సంస్థలు కూడా మూత పడ్డాయి. రోజు వారి కిరాణా, కూరగాయల్లాంటివి మాత్రం దొరుకుతున్నాయి.

జైపూర్‌కు చెందిన నగల వ్యాపారి హుకుమ్ చంద్ సోనీ 25 సంవత్సరాలుగా నగల వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు నగల దుకాణంలోనే కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి ఇంతకంటే మార్గం లేదని ఖాళీగా కూర్చోకుండా ఈ వ్యాపారం చేసుకుంటున్నాడు. చిన్న చిన్న ఆభరణాలు, ఉంగరాలు తయారు చేసి అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడినని చెప్పాడు.

ఇంటికి కిరాయి కట్టాలి. తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి. ఇటీవల తమ్ముడు మరణించాడు. అతడి కుటుంబాన్ని చూసుకోవాలి. ఇంత మంది ఎలా కూర్చొని తినాలి. చేతిలో డబ్బు లేదు, బ్యాంకు బ్యాలెన్సూ లేదు. దాంతో కూరగాయలు అమ్ముకోవడం మంచిదనిపించి చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టమనిపించదని అంటున్నాడు. కుటుంబం గడవడానికి ఏ వ్యాపారమైనా ఒకటేనని చెబుతున్నాడు.

Tags

Next Story