లక్షల లీటర్ల ఫ్రెష్, క్రాఫ్ట్ బీరు డ్రైనేజీపాలు.. గుండెలు బాదుకుంటున్న మందుబాబులు!

కరోనా దెబ్బకి ప్రజలు గజగజవణికిపోతున్నారు. కరోనా మహమ్మారిని నివారించడానికి కేంద్ర సర్కార్ లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు బంద్ అయ్యాయి. దీంతో మద్యం దొరక్క మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. లాక్ డౌన్ వేళ మందుబాబుల కష్టాలు అంత ఇంత కాదు. అసలే మద్యం దొరక్క బాధ పడుతుంటే.. ఎనిమిది లక్షల లీటర్ల ఫ్రెష్, క్రాఫ్ట్ బీరు డ్రైనేజీపాలు అవుతుందనే వార్త తెలిసి మందుబాబులు తెగ ఫీల్ అయిపోతున్నారు. అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో మద్యం తయారీ కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోతున్నాయి. బార్‌లు, క్లబ్‌లలో లభ్యమయ్యే ఫ్రెష్, క్రాఫ్ట్ బీరు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉండటంతో నిల్వ కోసం తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కరెంటు, ఇతర ఖర్చులు మీదపడుతుండటంతో తయారీ కేంద్రాలకు నష్టాలు తప్పడం లేదు. తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించడంతో దేశవ్యాప్తంగా దాదాపు 250 మైక్రో బ్రూవరీలు.. తమ నిల్వలను ఖాళీ చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఇప్పటికే హరియాణా గురుగ్రామ్‌లోని కొన్ని కేంద్రాలు పారబోత మొదలుపెట్టాయి.
క్రాఫ్ట్ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం.. ప్రస్తుతం అన్ని ప్లాంట్లలో కలిపి ఎనిమిది లక్షల లీటర్ల ఫ్రెష్ బీర్ నిల్వలున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇదంతా పాడవుతుంది. ఈ విషయం తెలిసి మందుబాబులు తెగ ఫీల్ అయిపోతున్నారు. మరోవైపు సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో మద్యం విక్రయాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com