ఒక్కడే కొడుకు .. నాలుగు నెలల క్రితమే పెళ్లైంది.. హంద్వారా ఎన్‌కౌంటర్లో..

ఒక్కడే కొడుకు .. నాలుగు నెలల క్రితమే పెళ్లైంది.. హంద్వారా ఎన్‌కౌంటర్లో..
X

ఓ బిడ్డకు తండ్రిగా బాధ పడుతున్నాను.. ఓ బ్రిగేడియర్‌గా దేశం కోసం ప్రాణాలర్పించిన నా కొడుకును చూసి గర్వపడుతున్నాను అని విషణ్ణ వదనంతో వ్యాఖ్యానించారు మేజర్ అనుజ్ సూద్ తండ్రి చంద్రకాంత్ సూద్. జమ్ముకశ్మీర్‌ హంద్వారా ఎన్‌కౌంటర్‌లో తన కొడుకు ప్రాణాలు కోల్పోవడం కలచి వేసిందని ఆయన అన్నారు. అదీ కాక అతడికి పెళ్లై నాలుగు నెలలే అయిందని అందుకే ఆ బాధ మరింత ఎక్కువగా ఉందని అనుజ్ తండ్రి రిటైర్డ్ బ్రిగేడియర్ అయిన చంద్రకాంత్ జాతీయ మీడియాకు వివరించారు.

ఆర్మీ అధికారిగా ప్రజల ప్రాణాలు కాపాడటమే తన కుమారుడి బాధ్యత అని, ఆ విధంగానే శిక్షణ పొందాడని చెప్పారు. తన కుమారుడిది వీరమరణమని కొడుకుని కోల్పోయిన బాధను గుండెల్లోనే దిగమింగుకుంటూ వ్యాఖ్యానించారు. హిమచల్‌కు చెందిన అనుజ్ ఎన్డీయే ద్వారా సైన్యంలో చేరారు. కాగా, హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మేజర్ అనుజ్ సూద్ సహా మొత్తం ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కల్నల్ అశుతోష్ శర్మ, నాయక్ రమేశ్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ సింగ్, జమ్ముకశ్మీర్ సబ్ ఇన్‌స్పెక్టర్ షకీల్ ఖాజీ కూడా ఉన్నారు.

ఈ ఘటనలో లష్కర్ ఎ తొయిబా కమాండర్ హైదర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హంద్వారా సమీపంలోని గ్రామంలో ఓ ఇంటి వారిని ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించేందుకు కల్నల్ అశుతోష్ శర్మ నేతృత్వంలో ఆపరేషన్ మొదలు పెట్టి బందీలను విడిపించారు. అయితే ఉగ్రవాదులతో పోరులో ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story