వైన్‌షాపుల ముందు భారీ క్యూలైన్లు.. పోలీసుల లాఠీచార్జ్

లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేవు. వైన్‌షాపులు తెరుచుకున్నాయి అనగానే మందుబాబుల ప్రాణాలు లేచొచ్చాయి. అబ్బ ఆ మాట వినగానే చెవుల్లో అమృతం పోసినట్టు అన్పించిందంటూ మందుబాబులు ఎగిరి గంతేసుకుంటూ ఒక్కసారిగా వైన్ షాపుల ముందు బారులు తీరారు.
కర్ణాటకలో ఓ మందుబాబు అయితే ఏకంగా మద్యం దుకాణానికి కొబ్బరి కాయ కొట్టి హారతులిచ్చాడు. ఇక దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో.. చుక్క కోసం ఇన్నాళ్లూ తహతహలాడిన మందు బాబులు ఇప్పుడు తండోపతండాలుగా వైన్ షాపుల వైపు పరుగులు తీస్తున్నారు.
ఢిల్లీ, చత్తీస్‌ఘడ్, కర్నాటక రాష్ట్రాల్లో వైన్ షాపులను ఓపెన్ చేయటంతో.. ఉదయం నుంచే షాపుల ముందు జనం క్యూ కట్టారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. కొన్ని చోట్ల సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కొన్ని చోట్ల జనం మరీ ఎక్కువ సంఖ్యలో ఉండడంతో.. సోషల్ డిస్టాన్సింగ్ నియమాన్ని పట్టించుకునేవారు లేరు.
కంటైన్మెంట్ జోన్లలో మినహా అనేక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తా రోడ్‌లో ఉన్న మద్యం షాపు వద్ద భారీ క్యూలైన్‌లో జనం నిలబడ్డారు. రెసిడెన్షియల్ ప్రాంతాల్లోనూ ఉన్న వైన్ షాపుల్లోనూ మద్యం అమ్మేందుకు అనుమతి ఇచ్చారు. సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో.. కశ్మీరీ గేటు ప్రాంతంలో ఉన్న వైన్‌షాపు వద్ద లాఠీచార్జ్ జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com