నాడు హీరోగా ప్రశంసలందుకున్న వ్యక్తి.. నేడు ఫుట్‌పాత్‌పై..

26/11 అనగానే ముందుగా గుర్తొచ్చే సంఘటన ముంబై పేలుళ్లు. ఆనాడు దేశ రాజధాని ముంబైలోని తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడిని ఏ ఒక్కరూ మర్చిపోలేరు. ఆ రోజు జరిగిన దాడిలో ముష్కరులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భారత జవాన్లతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. అతడే హరిష్‌చంద్ర శ్రీవర్ధంకర్. 60 ఏళ్లు పైబడిన ఆయన ఫుట్‌పాత్‌పై నిస్సహాయ స్థితిలో పడి ఉండడాన్ని ఓ వ్యక్తి గమనించారు. అతడి వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు.
మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీవర్ధంకర్‌కు 26/11 దాడిలో రెండు బులెట్లు తగిలాయి. అతడు ఆ దాడికి సంబంధించి ప్రధాన సాక్షి కూడా. పేలుళ్లకు ముఖ్య కారకుడైన కసబ్‌ను గుర్తించింది అతడే. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో శ్రీవర్ధంకర్ తీవ్రగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అంతకు ముందు ఉగ్రవాదుల్లో ఒకడైన అబు ఇస్మాయిల్‌తో గొడవ పడి.. అతడిని తన ఆఫీస్ బ్యాగ్‌తో కొట్టిన ధైర్యశాలి శ్రీవర్థంకర్.
ఫుట్‌పాత్‌పై అతడిని గుర్తించిన షాపు యజమాని వర్ధంకర్‌ను మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ అతి కష్టం మీద హరిష్ చంద్ర, బీఎంసీ, మహాలక్ష్మీ అనే మూడు పదాలు మాత్రం చెప్పగలిగారు. తినడానికి బిస్కట్ల వంటివి ఇచ్చినా అవి కూడా తినలేకపోయారు. ఓ పాత్రికేయుని ద్వారా ఆయన తమ్ముడి అడ్రస్ తెలుసుకుని కబురు చేశామని షాపు యజమాని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆరోజు హీరోగా గుర్తింపు పొందిన వర్థంకర్.. ఈ రోజు ఇలా దీనస్థితిలో పడి ఉండడం చుట్టుపక్కల వారిని కలచివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com