టీవీ5 కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

టీవీ5 కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

టీవీ5 కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. దాడికి పాల్పడింది ఎవరనేది తేల్చే పనిలో పడ్డారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేయగానే జూబ్లీహిల్స్‌ పోలీసులు వేగంగా స్పందించారు. జూబ్లీహిల్స్‌ సీఐతోపాటు ఇద్దరు ఎస్సైలు రాత్రే టీవీ5 కార్యాలయానికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అందరితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉదయం కూడా పోలీసులు దీనిపైనే ఫోకస్‌ చేశారు. మీడియా సంస్థపై దాడిని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు.. వెస్ట్‌జోన్‌ DCP ఏఆర్‌ శ్రీనివాస్‌, బంజారాహిల్స్‌ ACP కేఎస్‌ రావు, జూబ్లీహిల్స్‌ CI సత్తయ్య, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ ఉదయం స్పాట్‌ను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి దుండగుల్ని పట్టుకుంటామన్నారు.

టీవీ5 కార్యాలయంపై శనివారం రాత్రి సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. సెక్యూరిటీ రూమ్ అద్దం పగలగొట్టారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా రాత్రిపూట రోడ్లపై కనీస జన సంచారం కూడా లేదు. వాహనాల రాకపోకలు కూడా లేవు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తేల్చేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

రాత్రి పూట సుమారు 10 గంటల సమయంలో టీవీ5 ఆఫీస్‌పై దాడి పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇలాంటి టైమ్‌లో చెక్‌పోస్టులు దాటుకుని మరీ ఆ వ్యక్తులు టీవీ5 ఆఫీస్‌ వరకు వచ్చారంటే వాళ్ల లక్ష్యం ఏంటో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ముందే పక్కాగా రెక్కీ నిర్వహించినట్టుగా సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడుతూ దాడి చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడింది ఎవరో గుర్తించే ప్రయత్నం జరుగుతోంది

Tags

Read MoreRead Less
Next Story