ఆ ఏరియాల్లో మరికొన్ని సడలింపులు..

ఆ ఏరియాల్లో మరికొన్ని సడలింపులు..
X

రాష్ట్రంలో మూడో విడత లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరికొన్ని సడలింపులు చేసింది. ఈ నెల 11 నుంచి సడలింపులు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలతో పాటు, టీ స్టాల్స్ తెరిచేందుకు అనుమతించారు. కంటైన్‌మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతటా సోమవారం నుంచి ఈ కొత్త సడలింపులు అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గ్రేటర్ చెన్నై పరిధిలోని అన్ని దుకాణాలు ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. మిగిలిన దుకాణాలు ఉదయం 10.30 నుంచి సాయింత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. వైరస్ అధికంగా ఉన్న రెడ్ జోన్లు మినహా రాష్ట్రమంతటా కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు తెరిచి ఉంటాయి. మిగిలిన దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 7 వరకు పని చేస్తాయి. టీ షాపుల వద్ద కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి. ఎవరూ కూర్చుని కాఫీ సేవించకూడదు. రోజుకు ఐదు సార్లు టీ దుకాణాల్లో క్రిమినాశినితో శుభ్రపరచాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే షాపులు సీజ్ చేస్తారని సీఎం హెచ్చరించారు.

ఇక పెట్రోల్ బంకులు ఉదయం 6 నుంచి సాయింత్రం 6 వరకు తెరిచి ఉంటాయి. జాతీయ రహదారుల్లో ఉన్న పెట్రోల్ బంకులు 24 గంటలూ పని చేస్తాయి. ఇక ప్రైవేటు సంస్థలూ, కార్యాలయాలు రోజూ ఉదయం 10.30 నుంచి సాయింత్రం 6 గంటల వరకు పని చేస్తాయి. అయితే 33 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరవ్వాల్సి ఉంటుంది. సడలింపుల నిబంధనలన్నీ సరిగా అమలవుతున్నదీ లేనిదీ కలెక్టర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లు, స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని ఆదేశించారు.

Tags

Next Story