ఆంధ్రప్రదేశ్

స్టైరీన్ గ్యాస్ లీక్ తో ఆందోళనలో స్థానిక ప్రజలు

స్టైరీన్ గ్యాస్ లీక్ తో ఆందోళనలో స్థానిక ప్రజలు
X

స్టైరీన్ పీడకల ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉంది. విషం చిమ్మిన ఆ భయానకర దృశ్యాలను తల్చుకొని బాధితులు ఇంకా భయం భయంగానే ఉన్నారు. అసలే బిక్కుబిక్కుమంటు బతుకుతున్న ఆ 5 గ్రామాల ప్రజలను ఇప్పుడు భవిష్యత్తు కూడా భయపెడుతోంది. అస్వస్థతకు గురైన బాధితులకు ప్రాణాపాయం తప్పినా.. మున్ముందు మరిన్ని వ్యాధులబారిన పడతామోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. గ్యాస్ లీక్ ఘటన జరిగి 5 రోజులు అవుతోంది. అయినా..ఇంకా బాధితుల్లో కొందరి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి.

విషవాయుడు ప్రభావంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు ఊపిరి సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పని అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వాసతీసుకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఛాతిలో మంటగా ఉండటంతో పాటు..గుండె బరువుగా ఉన్నట్టు..అనిపిస్తోందని చెబుతున్నారు. మూత్రవిసర్జన సమయంలో మంట ఉంటోందిని చెబుతున్నారు. ఏం తిన్నా..తాగినా స్టైరీన్ వాసనే వస్తుందని అంటున్నారు. కొద్ది దూరం నడిచినా తీవ్ర ఆలసట ఆయాసంగా ఉంటుందన్నారు. ఇక విషవాయువు ప్రభావం తర్వాత ఎవరైనా మాట్లాడితే ఆ మాటలను ఆలస్యంగా అర్ధం అవుతున్నాయని బాధితులు చెబుతున్నారు. అంతేకాదు..గతంలోలాగ వేగంగా మాట్లాడలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో న్యూమోనియా లక్షణాలు కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. న్యూమోనియా లక్షణాలు ఉన్న చిన్నారులకు ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. అయితే.. స్టైరీన్ చర్మం పడినా దాని దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నది వైద్యుల వాదన. రక్తకణాల్లో స్టైరీన్ ఎంత మోతాదులో కలిసిందనేది కూడా బాధితుల ఆరోగ్య పరిస్థితిని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు భవిష్యత్తులో వ్యాధులబారిన పడతామనే భయం వెంటాడుతుంది. ఇక ఆస్పత్రుల నుంచి కోలుకున్నా..ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని అగమ్యగోచరంలో ఉన్నామని బాధితులు చెబుతున్నారు. ఊళ్లోకి వెళ్లాలంటేనే భయమేస్తోందని అంటున్నారు.

Next Story

RELATED STORIES