లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు కీలక పదాలను ఉపయోగించిన ప్రధాని మోదీ

లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు కీలక పదాలను ఉపయోగించిన ప్రధాని మోదీ
X

లాక్‌డౌన్ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ప్రజల ముందుకు వచ్చిన ప్రధాని మోదీ రెండు కీలక పదాలను ఉపయోగించారు. ఒకటి స్వయం సమృద్ధ భారత్, రెండోది స్వదేశీ. ఆత్మ నిర్భర భారత్ దేశ ప్రజల నినాదం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచశక్తిగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందన్నది మోదీ విశ్వాసం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని అనూహ్య విజయాలు సాధించడంలో భారతీయుల ఎప్పుడూ ముందుంటారని మోదీ నమ్ముతారు. అందుకే కరోనా కష్టకాలంలోనూ ఆత్మ నిర్భర భారత్‌ అంటూ ధైర్యంగా పిలుపునిచ్చారు. సవాళ్లను అధిగమించి స్వయం సమృద్ధ భారత్‌ను ఆవిష్కరి ద్దామంటూ కొత్త బాట చూపారు. టెక్నాలజీ పరంగా అగ్రదేశాలతో భారత్ పోటీ పడుతుందన్న మోదీ, కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రక్రియలో మాస్కులు, పీపీఈ కిట్లు, వైద్య పరికరాలను దేశం సొంతంగా సంపా దించుకుందని గర్వంగా చెప్పారు.

స్వయం సమృద్ధ భారత్‌లో ఐదు అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, మన సమాజం, మన ప్రజాస్వామ్యం, డిమాండ్‌ అనే 5 పిల్లర్లు మనదేశానికి అత్యంత ముఖ్య మని చెప్పారు.

ఇక, మోదీ ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన అంశం స్వదేశీ. ఎన్నో ఏళ్లుగా ఇది చర్చల్లో ఉన్నదే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో కొద్దిగా స్వదేశీని ఆదరించినప్పటికీ తర్వాత్తర్వాత విదేశీ వాడకం ఎక్కువై తప్పనిసరిగా మారింది. ఆర్థిక సంస్కరణల పుణ్యమా అంటూ పారిశ్రామికీకరణ పెరిగి స్వదేశీకి దాదాపుగా మంగళం పాడేశారు. పెట్టుబడిదారి వ్యవస్థలో దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన గ్రామాలు, కుల వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్వదేశీ కళలకు ప్రాధాన్యం తగ్గి లోకల్ బ్రాండ్స్‌కు గిరాకీ లేకుండా పోయింది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా పేరుతో వినూత్న పథకాన్ని ప్రకటించారు. తాజాగా, మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని స్వదేశీ నినాదంగా మార్పు చేశారు.

లోకల్ బ్రాండ్‌కే మీ ఓటు.. స్థానిక ఉత్పత్తులను ఆదరించండి. లోకల్‌ ప్రొడక్ట్స్‌కు చేయూతనివ్వండి..లోకల్‌కు వోకల్‌గా మారండి..అంటే స్థానిక ఉత్పత్తులకు ప్రజలే ప్రచార కర్తలు కావాలి.. ఇదీ మోదీ స్వదేశీ పిలుపు సారాంశం. లోకల్ ప్రొడక్ట్స్‌కు గిరాకీ పెరిగితే స్థానికంగా ఆర్థిక పరిస్థితులు చక్కబడడానికి అవకాశం ఏర్పడుతుందని తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మోదీ సర్కా రు అంచనా. అందుకే నేను లోకల్ అంటూ ప్రజలను స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి ప్రోత్సహిస్తోంది.

బీజేపీ, హిందూత్వ వాదులు, హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో స్వదేశీ డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇక్కడి ఉత్పత్తులకు పెద్ద పీట వేయాలని, స్థానికంగా వస్తువుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని పదేపదే అడుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా మేక్ ఇన్ ఇండియాకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు కరోనా కూడా కలసి వచ్చింది. వైరస్ దెబ్బకు చైనా నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయి. అవన్నీ భారత్‌వైపు ఆశగా చూస్తున్నాయి. మనదేశంలో అపారమైన అవకాశాలు ఉండడం, వాతావరణ పరిస్థితులు, ప్రజల కష్టించి పని చేసే మనస్తత్వం, అన్నింటికంటే ముఖ్యంగా అధిక సంఖ్యలో యువత ఉండడం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇదే అదనుగా మోదీ సర్కారు పావులు కదుపుతోంది. విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూనే మేక్ ఇన్ ఇండియాను పటిష్టంగా అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రజలను కూడా స్వదేశీ వైపు అడుగులు వేసేలా చర్యలు తీసుకుంటోంది.

Tags

Next Story