ప్రభుత్వం సూచించిన పంటలే రైతులు సాగు చేయాలి : కేసీఆర్‌

ప్రభుత్వం సూచించిన పంటలే రైతులు సాగు చేయాలి : కేసీఆర్‌

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ వర్షాకాలంలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను చర్చించేందుకు ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడాలని సిఎం నిర్ణయించారు. రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే విధంగా రైతుల పరిస్థితి తయారైందని.. రైతులు పండించిన పంటలకు ఇకనైనా గౌరవ ప్రదమైన ధరలు రావాలంటే ఏం జరగాలో ఆలోచించుకోవాలని కేసీఆర్‌ అన్నారు. గతం మాదిరిగానే ప్రభుత్వం ప్రేక్షక వహించాలా? లేక మార్పు కోసం ప్రయత్నించాలా? అన్నది నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చిందన్నారు. మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే మొత్తం పంటను కొనుగోలు చేశామని.. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని కేసీఆర్‌ తెలిపారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి.. ఆ తర్వాత అమ్ముడుపోక ఇబ్బంది పడవద్దని.. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతులకు ఎప్పుడు ఏ పంటలు వేయాలన్నది ప్రభుత్వమే సూచిస్తుందని.. వాటిని అనుసరిస్తేనే రాష్ట్రంలో రైతుల కష్టాలు దూరమవుతాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story