మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్

మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్
X

ఏపీలో జగన్‌ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం ద్వారా భూముల అమ్మకాల ప్రక్రియను ఏపీ సర్కార్ మొదలుపెట్టింది. తొలి విడతలో విశాఖ, గుంటూరు నగరాల్లో 9 చోట్ల భూములు అమ్మాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ భూముల విక్రయాలకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖలో ఆరు, గుంటూరులో మూడు ప్రాంతాల్లో ఉన్న భూములను వేలం వేయనున్నారు. ఈ నెల 29న గుర్తించిన 9 ప్రాంతాల్లోని భూములను వేలం వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలం ఆదాయంతోనే నవరత్నాలు, నాడు-నేడు పథకాలకు నిధులు సమకూర్చుకునే పనిలో పడింది ఏపీ సర్కారు. వేలం వేయాలనుకున్న 9 భూములకు మొత్తం రిజర్వ్ ధరను రూ.208.62 కోట్లుగా నిర్ణయించింది. ధరావతు కింద పదిశాతం చెల్లించాని నిబంధనల పెట్టారు అధికారులు.

గుంటూరు నగరంలోని నల్లపాడు, శ్రీనగర్ కాలనీల్లో రెసిడెన్షియల్ ప్రాంతాల్లో భూములను వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గుంటూరు మెయిన్ జీటీ రోడ్డులోని కమర్షియల్ ప్రాంతాల ప్రభుత్వ భూములను కూడా వేలం వేయనుంది. ఇక విశాఖ విషయానికొస్తే.. చినగదిలిలోని రెసిడెన్షియల్ ప్రాంతంలో, అగనంపూడిలో రిక్రియేషన్ భూములను, ఫకీర్ టకియాలో ఉన్న ఎస్‌ఈజెడ్ భూములను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూముల వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రకటించారు.

సీఎం జగన్‌ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. తాను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నవరత్నాల పథకాలకు నిధుల కోసం భూములు వేలం వేయాలని నిర్ణయించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు కూడా ఇలాగే ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చారు. తాను తీసుకొచ్చిన పథకాల కోసం ఆ నిధులను వెచ్చించారు. ఆక్షన్ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారు నగదు చెల్లింపు తరువాత భూములపై పూర్తి హక్కులు పొందే అవకాశం ఉంటుంది.

Tags

Next Story