బస్సు వచ్చే టైమైంది.. ఇంకా అయిదు రోజులే..

ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అని ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు దేశ ప్రజలు. ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయటకు రావాలా అని ఎదురు చూస్తున్నారు. మే 18కి ఇంకా అయిదు రోజులే ఉంది. ఆ రోజు నుంచి ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వడంతో ప్రజా రవాణా శాఖాధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీ కల్లా బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు.
దీంతో అనంతపురం రీజియన్‌లో ఆర్ఎం సుమంత్ వివిధ డిపోల్లోని డీఎం, తదితరులను అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా మొదటి దిశలో 635 బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఇక బస్సుల్లో సీటింగ్ ఏవిధంగా ఉండాలనే దానిపై సిబ్బందికి పలు సూచనలు చేశారు ఆర్టీసీ అధికారులు. భౌతిక దూరం కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు 50 శాతం మంది ప్రయాణికులను మాత్రమే ఎక్కించుకుంటారు. టిక్కెట్లు కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవలసిందే. ఒకవేళ బస్సులో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్‌లో ఫోన్ పే, గూగుల్ పే, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com