హైకోర్టుకు చేరిన ఆవ భూములు కొనుగోళ్ల వ్యవహారం

హైకోర్టుకు చేరిన ఆవ భూములు కొనుగోళ్ల వ్యవహారం

తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూముల కొనుగోళ్లలో అవకతవకల వ్యవహారం హైకోర్టుకు చేరింది. రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 600 ఎకరాల కొనుగోలు చేసింది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ హైకోర్టులో స్థానిక రైతు శ్రీనివాసులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ భూముల కొనుగోలుకు సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించ వద్దని ఆదేశించింది.

బూరుగుపూడి సమీపంలో ప్రభుత్వం సేకరించిన 586 ఎకరాల వెనుక కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే విషయాన్ని ఇప్పటికే టీవీ5 వెలుగులోకి తెచ్చింది. స్థానిక రైతులు కూడా మొదట్నుంచి ఈ కొనుగోళ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 7 లక్షల 20 వేల రూపాయల విలువైన భూమికి 6 రెట్లు పరిహారం పెంచి 45 లక్షలు చెల్లించడం వెనుక ఏం జరిగిందో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది అనేక విషయాలు కోర్టు దృష్టికి తెచ్చారు. డివిజినల్ బెంచ్ ముందు వాదించిన పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రసాద్ బాబు.. ముంపునకు గురయ్యే ఆవ భూములను కొనుగోలు చేయడంలో అధికారులు, రాజకీయ నాయకులు కుమ్ముక్కయ్యారని.. ప్రజాధనం దుర్వినియోగం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. అక్కడ 20 అడుగుల లోతు వున్న గుంతలు పూడ్చాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇలాంటి చోట్ల పట్టాల పంపిణీ సరికాదని.. రైతులకు డబ్బుల చెల్లింపులు కూడా ఆపాలని కోరారు.

అటు, ప్రభుత్వ తరుపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇలాంటి కేసుకు సంబంధించి దక్షిణాఫ్రికాలోని జడ్జిమెంట్‌ను ధర్మాసనం ముందు వుంచారు. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లే అనేకం ఉన్నప్పుడు.. ఇతర దేశాల ఉదాహరణలు ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ఇచ్చిన జీవో నెంబర్ 107పై హైకోర్టు స్టే ఇచ్చినందున దీనిపై సుప్రీంకి వెళ్లిన విషయాన్ని ఏజీ కార్యాలయం తరుపున సుమన్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కౌంటర్ ఫైల్ వేసేందుకు వారం రోజులు సమయం ఇచ్చింది డివిజన్ బెంచ్.

ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆవ భూముల వ్యవహారంపై వాదనల సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. భూముల కొనుగోలుకు సంబంధించిన డబ్బులు రైతులకు ప్రభుత్వం విడుదల చేస్తే, వారి నుంచి తిరిగి రాబట్టడం కష్టమైన వ్యవహారమని అభిప్రాయపడింది. అందుకే.. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు భూములు అమ్మిన రైతులకు డబ్బు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story