ఆన్‌లైన్ మార్కెట్‌ కోలుకునేది ఎప్పటికో!!

ఆన్‌లైన్ మార్కెట్‌ కోలుకునేది ఎప్పటికో!!
X

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం.. అన్ని రకాల మార్కెట్‌లు నిలిచిపోవడం తెలిసిందే. ఇప్పుడిప్పుడే సడలింపులతో మెల్లమెల్లగా సాధారణ వాతావరణం ఏర్పడేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకూ నిలిపివేసిన ఆన్‌లైన్ సేల్స్‌ కూడా అనుమతిస్తున్నారు. మరి 7 వారాల లాక్‌డౌన్ తర్వాత ఆన్‌లైన్ మార్కెట్ ఎలా ఉంది? అమ్మకాలపై కంపెనీలు ఏమంటున్నాయి?

లాక్‌డౌన్‌ కారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలలో కూడా.. నిత్యావసరాల డెలివరీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. తాజాగా ఆన్‌లైన్‌లో కొన్ని ఇతర విభాగాలలో కూడా అమ్మకాలకు అనుమతి లభించింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్‌ల నుంచి దుస్తుల వరకు విక్రయాలకు పర్మిషన్ లభించింది. అయితే.. ప్రస్తుతం పరిస్థితి వీటి అమ్మకాలు పెరిగేందుకు ఏమాత్రం సహకరించడం లేదు.

ఆన్‌లైన్ డెలివరీలకు అనుమతి కేవలం గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌లలో మాత్రమే ఉంది. రెడ్‌జోన్‌లలో ఇప్పటికీ కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. కానీ ఆన్‌లైన్ మార్కెట్‌కు ప్రధానంగా మెట్రో నగరాల నుంచే ఎక్కువ సేల్స్ లభిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరబాద్ వంటి మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్‌లోనే ఉన్నాయి. దీంతో లాక్‌డౌన్‌పై పాక్షికంగా ఆంక్షలు సడలించినా.. అమ్మకాలలో అంతగా పురోగతి లభించడం లేదు. మరోవైపు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలలో కూడా డిమాండ్ అంతంత మాత్రంగానే కనిపిస్తోందని కంపెనీలు చెబుతున్నాయి.

సాధారణ స్థాయితో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం ఆన్‌లైన్ విక్రయాలు కేవలం 60 శాతంగానే ఉంటున్నాయి. ప్రజలు ఇప్పటికీ నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. అవసరాలు కాని విభాగాలలో అమ్మకాలు ఏమాత్రం ఊపందుకోవడం లేదని.. కంపెనీలు అంటున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉండగా.. రాబోయే కొన్ని నెలలపాటు కూడా ఇదే కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. మెట్రో సిటీలలో డెలివరీలకు ఆమోదం లభించినా సేల్స్ పెరగడం కష్టమేనని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు.

ప్రజల ఆదాయాలు తగ్గిపోవడం, ఉద్యోగాలను తగ్గించుకునేందుకు కంపెనీలు చూస్తుండడం, జీతాల కోత వంటి అంశాల కారణంగా కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీంతో లాక్‌డౌన్ తర్వాత కూడా ఆన్‌లైన్ మార్కెట్‌కు డిమాండ్ తిరిగి కుదురుకోవడం కష్టమేననే కామంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఏసీలు, వాషింగ్ మెషీన్‌ల వంటి వస్తువులకు డిమాండ్ కనిపిస్తున్నా.. ప్రధాన మార్కెట్ అయిన టీ-షర్ట్స్, షార్ట్స్, కుర్తీలు, హై-వాల్యూ గార్మెంట్స్ జోలికి కస్టమర్లు వెళ్లడం లేదు. వీటికి డిమాండ్ ఉండే మెట్రో సిటీలలో ప్రస్తుతం డెలివరీ చేసే పరిస్థితి లేదు. అందుకే ఆన్‌లైన్ మార్కెట్‌లో మరికొంతకాలం మందగమనం కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags

Next Story