రోడ్డు ప్రమాదంలో 14 మంది వలస కార్మికులు దుర్మరణం

ఇంటికి చేరనేలేదు మద్యలోనే జీవితం ముగిసిపోయింది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది వలస కార్మికులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళుతుండగా ఈ దుర్ఘటనలు జరిగాయి. బ్రతుకుదెరువు కోసం పొట్ట చేత బట్టుకుని వలస కూలీలు ఎక్కడ పని దొరుకుతుందంటే అక్కడికి వెళుతుంటారు. పని ఇచ్చిన యజమాని సలహా మేరకు నెలకో రెండ్నెల్లకో వెళ్లి తమ వారిని చూసుకుని మళ్లీ వస్తుంటారు.
అలాంటిది లాక్డౌన్ కారణంగా పనిలేక, అయిన వారికి దూరంగా ఉండలేక, వెళ్లే మార్గంలేక నానా అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లాక్డౌన్ సడలింపులతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు బయలు దేరారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్-సహరాన్‌పుర్ రహదారిపై అదే రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆరుగురు కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారంతా అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
బీహార్ చెందిన వీరంతా పంజాబ్ నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన మరో ప్రమాదంలో యూపీకి చెందిన 8 మంది కూలీలు దుర్మరణం చెందారు. బుధవారం మహారాష్ట్ర నుంచి బయలు దేరిన 60మంది కూలీలు మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతానికి రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లారీలో వస్తున్న వీరిని బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com