శంషాబాద్‌లో చిరుత కలకలం

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ నుంచి తప్పించుకున్న చిరుత.. శంషాబాద్ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. నర్కుడ గ్రామంలోని ఓ ఇంటి ఆవరణంలో మేక రక్త గాయాలతో మృతి చెందడంతో చిరుతపులే దాడి చేసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. మేక శరీరంపై గాయాలను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు.. దాడి చేసింది చిరుతపులి కాకపోవచ్చని అంటున్నారు. వెటర్నరీ డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.
హైదరాబాద్ శివారులోని గగన్ పహాడ్- కాటేదాన్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం కనిపించిన చిరుత.. ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసి పారిపోయింది. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల మీదుగా హిమాయత్ సాగర్‌వైపు చిరుత వెళ్లినట్లు గుర్తించిన అధికారులు.. దాన్ని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతలోపే కవ్వగూడ, మర్లగూడలో చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో చిరుత చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కానీ ఇంతలోపే శంషాబాద్ మండలం నర్కుడలో మేకపై దాడి జరగడంతో చిరుత ఈ ప్రాంతంలో తిరుగుతోందా అన్న అనుమానం మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com