18 May 2020 5:42 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / కరోనా వ్యక్తికి...

కరోనా వ్యక్తికి కర్మకాండలు.. కావలసిన వాళ్లెవరూ ఉండరు.. జీహెచ్ఎంసీ ప్రొసీజర్

కరోనా వ్యక్తికి కర్మకాండలు.. కావలసిన వాళ్లెవరూ ఉండరు.. జీహెచ్ఎంసీ ప్రొసీజర్
X

మనిషి ఎప్పుడూ ఒంటరే.. నిజమే.. ఒంటరిగానే వస్తారు.. ఒంటరిగానే వెళ్లిపోతారు.. మధ్యలోనే ఈ బంధాలు, అనుబంధాలు.. అయిన వారు దూరమైతే అంతులేని బాధ గుండెల్లో గూడు కట్టుకుంటుంది. కడసారి చూపులకు నోచుకోకపోతే జీవితాంతం ఏదో తప్పు చేసిన భావన వెంటాడుతుంది. కరోనా మహమ్మారి వచ్చి కన్నవాళ్ళని, కట్టుకున్న వాళ్లని కాటికి పంపేస్తుంటే చివరి చూపులకు నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న కుటుంబాలెన్నో. అయిన వారి అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోని దయనీయ స్థితి. వైరస్ ఓ మాయని మచ్చగా మనుషుల మీద ఓ ముద్ర వేసి పోతోంది. నీ తోడు ఎవరూ లేరు.. నువ్వొక్కడివే పోరా బాబూ పో అంటూ తనే సాగనంపుతోంది. మున్సిపాలిటీ వాళ్ల చేత తలకొరివి పెట్టిస్తుంది. భగవంతుడా ఎప్పుడైనా తీసుకుపో.. కానీ ఇప్పుడు మాత్రం వద్దు.. నా కోసం ఓ నలుగురు ఏడవాలి.. నన్ను ఓ నలుగురు మోయాలి అని దీనంగా రోదిస్తున్నారు కరోనా వలన కోలుకోలేకపోతున్న బాధితులు.

కరోనా సోకిన వ్యక్తి మరణిస్తే అయిన వారు రాకపోగా.. అంతిమ సంస్కారాలు చేసేందుకు గ్రామస్థులు కూడా అడ్డు తగులుతున్నారని జీహెచ్‌ఎంసీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్గనిర్ధేశాల ప్రకారం జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలకు దయ చేసి స్థానికులెవరూ అడ్డుతగల వద్దని కోరుతున్నాం అని వివరించారు.

బాధిత వ్యక్తి మరణిస్తే జీహెచ్‌ఎంసీ తీసుకునే జాగ్రత్తలు..

అతడు/ఆమె శరీరాన్ని ముందుగా సోడియం హైపోక్లోరైట్ ద్రావకంతో శుభ్రం చేస్తారు.

ముఖం మినహా మిగతా శరీరాన్ని తెల్లటి వస్త్రంలో చుడతారు

ఆపై మళ్లీ ఒక శాతం సోడియం హైపోక్లోరైట్‌ను చల్లుతారు

నలభై నిమిషాల అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన నల్లటి జిప్ బ్యాగ్‌లోకి డెడ్‌బాడీని మారుస్తారు.

అంబులెన్స్ లోపల కూడా సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తారు. అనంతరం పోలీస్ ఎస్కార్ట్‌తో భౌతిక కాయాన్ని శ్మశానవాటికకు తరలిస్తారు.

ఆఖరి చూపులకు ఐదుగురు కుటుంబసభ్యులకు అనుమతి. అది నాలుగు మీటర్ల దూరంలో నిలబడాలి.

అంత్యక్రియల్లో పాల్గొనే సిబ్బంది పీపీఈ, హ్యాండ్ గ్లౌవ్స్, మాస్కు, కళ్లజోడు తప్పనిసరిగా ధరించాలి. ఆ సమయంలో ఎక్కడా తడి లేకుండా ఉండాలి.

అంతిమ సంస్కారాల్లో ఖననం చేయాల్పి వస్తే.. ఎనిమిది అడుగుల గుంతలో మృతదేహాన్ని పూడుస్తారు. మధ్యలో మట్టితోపాటు బ్లీచింగ్ వాడతారు.

దహనం చేస్తే పొగ ఎక్కువ రాకుండా జాగ్రత్త పడతారు.

చితాభస్మాన్ని తీసుకోవడానికి అనుమతి ఇస్తారు.

అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతం చుట్టుపక్కల ఒకటికి రెండు సార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావకాన్ని పిచికారి చేస్తారు.

అనంతరం మళ్లీ అంబులెన్స్‌ని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేస్తారు.

కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది వాడిన వస్తువులన్నీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సేకరించి ఆహుతి చేస్తారు.

బాడీని భద్రపరచాల్సి వస్తే నాలుగు డిగ్రీల సెల్సియస్ కోల్డ్ చాంబర్‌లో ఉంచుతారు

మార్చురీలను, క్వారంటైన్ కేంద్రాలను ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేస్తుంటారు.

Next Story