'అంఫన్' తుఫాన్‌కి ఆపేరెలా వచ్చింది..!!

అంఫన్ తుఫాన్‌కి ఆపేరెలా వచ్చింది..!!

తాజా తుఫాన్‌ అంఫన్‌కి పేరు పెట్టింది థాయిలాండ్. వారి భాషలో అంఫన్ అంటే ఆకాశం అని అర్థం. తుఫానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరులో మొదలైంది. ఆగ్నేయాసియా దేశాలే తుఫానులకు పేర్లు పెడుతుంటాయి. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ప్రజలకు చేరేందుకే తుఫానులకు పేర్లు పెడుతుంటారు. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. కనీసం 61 కి.మీ వేగంతో గాలులు వీచి తుఫాను సంభవించినప్పుడు పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది.

అమెరికాలో తుఫానులను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే తుఫానులను టైఫూన్స్ అని పిలుస్తుంటారు. హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులను సైక్లోన్స్ అని పిలుస్తారు. వెస్టిండీస్ దీవుల్లోని తుఫాన్లను హరికేన్స్ అంటారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుఫాన్లకు విల్లీవిల్లీస్ అని పేరు.

హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు 8.. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు. ఎవరైనా తుఫాన్లకు పేర్లు పెట్టవచ్చు. భారత వాతావరణ విభాగానికి ఈ పేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆమోదం పొందిన పేరు భారత్ తరపున జాబితాలో చేరుతుంది.

2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ కూడా ఈ ప్యానెల్‌లో చేరడంతో ఇప్పడు ఈ దేశాల సంఖ్య 13 కు చేరుకుంది. వాతావరణ శాఖ నిబంధనల మేరకే ఈ పేర్లు పెడతారు. తుఫాన్ పేరు పలికేందుకు వీలుగా వుండాలి. 8 అక్షరాల లోపు ఉండాలి. అన్నిటి కంటే ముఖ్యమైంది ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బ తీసే విధంగా ఉండకూడదు.

Tags

Read MoreRead Less
Next Story