ఏపీలో ఆర్టీసీ బస్ సర్వీస్‌లు ప్రారంభం.. పిల్లలు, వృద్ధులకు నో టికెట్

ఏపీలో ఆర్టీసీ బస్ సర్వీస్‌లు ప్రారంభం.. పిల్లలు, వృద్ధులకు నో టికెట్
X

ఏపీలో ఆర్టీసీ బస్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో దాదాపు 2 నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కుతున్నాయి. పూర్తి స్థాయిలో అన్ని సర్వీసులు అందుబాటులోకి తేకపోయినా.. రాష్ట్రవ్యాప్తంగా 436 రూట్లలో 1683 బస్సులు తిప్పుతున్నట్టు ఆర్టీసీ MD వివరించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే బస్సులు తిరుగుతాయి. గురువారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నందున ఆన్‌లైన్ బుకింగ్స్‌కు బుధవారం నుంచే అనుమతి ఇచ్చారు. రిజర్వేషన్ లేకపోతే బస్సు ఎక్కేందుకు వీలు కాదని RTC ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు APSRTC ONLINE. IN వెబ్‌సైట్‌లో టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడ- విశాఖ మధ్య 1 AC, 6 సూపర్ లగ్జరీ బస్సుల్ని మాత్రమే తిప్పుతున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా కేవలం 18 సీట్లు మాత్రమే రిజర్వ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. 3 వరుసలు సీట్లు ఏర్పాటు చేసిన వాటిల్లో 26 రిజర్వేషన్ చేసుకునే వీలుంది.

ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులు నడిపిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, పొరుగు రాష్ట్రాల నుంచి సానుకూల స్పందన వస్తే అంతర్రాష్ట్ర సర్వీస్‌లు మొదలు కానున్నాయి. లాక్‌డౌన్ వల్ల దాదాపు 1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని MD మాదిరెడ్డి ప్రతాప్ అంటున్నారు. కరోనా ఎఫెక్ట్‌ నేపథ్యంలో ప్రయాణికులంతా తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం లాంటి నిబంధనలు కూడా పాటించాలని కోరారు. ఇబ్బందులు ఉన్నా ఛార్జీలు మాత్రం పెంచడం లేదని RTC MD వివరించారు.

ఆర్టీసీ బస్సుల్ని తిప్పేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో డిపోల్లో బస్సులన్నీ పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. అలాగే బస్సుల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా కొన్ని సీట్లకు మార్కింగ్ వేశారు. బస్సుల్లో కండెక్టర్‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లోనే టికెట్‌లను బుక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి నగరాల్లో బస్ డిపోల వద్ద రద్దీని దృష్టిలో పెట్టుకుని , కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని డీలక్స్ బస్సుల్లో సీట్ల మార్పునకు ఒక్కో బస్సుకి 10 వేల రూపాయలు ఖర్చు పెట్టారు.

విశాఖపట్నం జిల్లాలో గురువారం విశాఖ, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం డిపోల నుంచి 112 బస్సులు నడుపుతామని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో గురువారం తొలి రోజు 30 రూట్లలో 136 బస్సులు నడపనున్నారు. అన్ని మండల కేంద్రాలు, ప్రధాన రూట్లను టచ్ చేసేలా సర్వీసులు ఉంటాయి. ఆన్‌లైన్‌తోపాటు బస్‌స్టాండ్‌లో టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 20 శాతం సర్వీసులు మాత్రమే తిప్పుతున్నారు. గుంటూరు బస్ స్టేషన్ నుంచి శుక్రవారం 99 సర్వీసులు తిరుగుతాయి. కర్నూలు రెడ్ జోన్‌లో ఉన్నందున అక్కడ చాలా తక్కువగా బస్సులు నడపనున్నారు. అటు, తిరుపతిలో కూడా RTC రీజనల్ మేనేజర్లు ఈ తరహా ఏర్పాట్లే చేశారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె బస్సులు బస్సులు నడిపేందుకు వీలుగా అన్నీ సిద్ధం చేశారు. శానిటైజర్లు వంటివాటిని కూడా సిద్ధంగా ఉంచారు. దాదాపుగా బస్సులు అన్నీ నాన్‌స్టాప్ సర్వీసులుగానే ఉంటాయి. అటు, కరోనా నేపథ్యంలో వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, జర్నలిస్ట్‌లకు ఇస్తున్న రాయితీలు ప్రస్తుతానికి ఉండబోవని స్పష్టం చేసింది. 10 ఏళ్లలోపు చిన్నపిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధలకు బస్సును ఎక్కనివ్వబోమని స్పష్టం చేశారు.

Tags

Next Story