50 వేల మార్క్‌ను టచ్‌ చేయనున్న బంగారం!

50 వేల మార్క్‌ను టచ్‌ చేయనున్న బంగారం!
X

10 గ్రాముల బంగారం 50 వేలకు చేరుతుందా... ఏమో పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది... తులం బంగారం 50 వేల మార్క్‌ చేరడానికి ఇంకా పెద్దగా సమయం పట్టకపోవచ్చనిపిస్తోంది. లాక్‌డౌన్‌తో పెళ్లిల్లు, ఇతర శుభకార్యాలు నిలిచి కొనుగోళ్లు లేనప్పటికీ.. రేట్లు మాత్రమే పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కరాణం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా ఎఫెక్ట్‌.. గోల్డ్‌ పైనా పడుతోంది. దీంతో.. ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48 వేల 400లకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర... 45 వేల360 వరకు కొనసాగుతోంది.

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం అన్ని వ్యాపారాలపై పడినా... బంగారం ధరలు మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు కొండెక్కి కూర్చొంటున్నాయి. కరోనా వైరస్‌ సంక్షోభంలో... ఇన్వెస్టర్లు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తున్నారు. దీంతో.. బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 9న... బంగారం ధరలు తొలిసారిగా 45 వేల రూపాయల మార్క్‌కు చేరాయి. ఇక ఆ తర్వాత... స్వల్ప తేడాతో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధరల 2 వేల డాలర్లు తాకినా ఆశ్చర్యపోనవసరంలేదు. దాదాపు 2 వారాల నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

అమెరికా- చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, జపాన్ దేశాల బలహీన ఎకనామిక్ డేటా ఇవన్నీ పసిడి ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. బంగారం ధరలు... ఇలాగే కొనసాగవచ్చని... బులియన్‌ మార్కెట్‌, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కిలో వెండి ఏకంగా... 49 వేల రూపాయలకు చేరుకుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే..కిలో వెండి 50 వేలు దాటడానికి మరింత సమయం పట్టకపోవచ్చు.

Tags

Next Story