డాక్టర్‌ సుధాకర్‌ ఎపిసోడ్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

డాక్టర్‌ సుధాకర్‌ ఎపిసోడ్‌.. వెలుగులోకి సంచలన విషయాలు
X

డాక్టర్‌ సుధాకర్‌ ఎపిసోడ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తప్పు ఒప్పుకోవాలంటూ సుధాకర్‌ తల్లికి ఓ మంత్రి ఫోన్‌ చేయడం సంచలనంగా మారింది. తప్పు చేసినట్లు ఒప్పుకోవాలంటూ సుధాకర్‌ తల్లితో సదరు మంత్రి మాట్లాడటం దుమారం రేపుతోంది.. పెద్దల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని సుధాకర్‌ తల్లి చెప్పారు.. ఫోన్లు చేసి జాబ్‌ ఇస్తాం.. ఏం చేయొద్దు.. ముందుకెళ్లొద్దని అంటున్నారని సుధాకర్‌ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ5తో ఎక్స్‌క్లూజివ్‌గా సుధాకర్‌ తల్లి మాట్లాడారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు.

అంతేకాదు, టీవీల ముందుకు వెళ్లొద్దని చెబుతున్నారని.. మా కుమారుడి దగ్గరకు మావాళ్లెవరినీ వెళ్లనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని బలవంతం పెట్టి ఏం చెప్పించినా ఒప్పుకునేది లేదన్నారు.. పెద్దల ఫోన్‌ కాల్‌ ఉద్దేశం నోరు మూసుకుని ఉండమనే అర్థం వచ్చేలా ఉందని ఆమె అన్నారు. మమ్మల్ని తప్పు ఒప్పుకోమన్నట్టుగానే వారి వైఖరి కనబడుతోందని సుధాకర్‌ తల్లి చెప్పారు. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు తప్పు ఎలా ఒప్పుకుంటారని సుధాకర్‌ తల్లి ప్రశ్నించారు. తన కుమారుడికి అన్యాయం జరిగిందని, మా కుటుంబం పరువు తీశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.. మాకు సహకరించిన వారి సమక్షంలోనే క్షమాపణలు చెప్పాలని సుధాకర్‌ తల్లి డిమాండ్‌ చేశారు.

అటు డాక్టర్‌ సుధాకర్‌ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత.. సుధాకర్‌ కుటుంబ సభ్యులను కలిసిన అనిత.. న్యాయం జరుగుతుందని ధైర్యం చెప్పారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు అనిత. మానసిక వైద్యశాలలోనూ సుధాకర్‌ను సుఖంగా ఉండనివ్వడం లేదంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. వెంటనే సుధాకర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అనిత డిమాండ్‌ చేశారు.

పోలీసులు తమ చర్యలను సమర్థించుకోవడానికే డాక్టర్‌ సుధాకర్‌ను మానసిక వైద్యశాలలో చేర్పించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Tags

Next Story