చికెన్ ధర చుక్కల్లో..

రెండు నెలల క్రితం కిలో చికెన్ రూ.50 అన్నా కొనే నాధుడు లేడు. చికెన్ తింటే కరోనా వస్తుందేమో అని కోడి కూర ఊరిస్తున్నా మిన్నకుండి పోయారు మాంసాహార ప్రియులు. ఇప్పుడు తిందామంటే ధర చుక్కల్ని తాకుతోంది. లాక్డౌన్ వలన ప్రొడక్షన్ తగ్గిపోయిందని రోజుకి 4 లక్షల కోళ్లను మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని అంటున్నారు స్నేహ ఫార్మ్ చైర్మన్ రామ్ రెడ్డి. వ్యాపారం కాస్త గాడిలో పడ్డాక రోజుకి 10 లక్షల కోళ్లను సరఫరా చేస్తామని అప్పుడు రేటు తగ్గుతుందని చికెన్ ప్రియులకు అభయమిస్తున్నారు.
రెండు వారాల క్రితం వరకు కిలో చికెన్ ధర రూ.400 ఉండగా, ఆదివారం ఏకంగా రూ.500కి చేరుకుంది. కేవలం బోన్‌లెస్ చికెనే కాదు స్కిన్ లెస్ చికెన్ ధర కూడా ఆకాశాన్నంటుతోంది. వేసవి కావడంతో ఉత్పత్తి కూడా సరిగా లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడడంతో చికెన్ సేల్స్ 60 శాతం పడిపోయాయి. మటన్ ధర కూడా అదే రేంజ్‌లో పెరిగి కిలో రూ.1000లకు చేరుకుంటే జీహెచ్ఎంసీ పెరిగిన ధరలకు కళ్లెం వేయడంతో ప్రస్తుతం రూ.700లకు కిలో మటన్ అమ్ముతున్నారు. పెరిగిన ధరలు మాంసాహార ప్రియులకు మింగుడు పడకుండా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com