ఐడియా అదిరింది గురూ.. మాస్కుల్లో ముఖం స్పష్టంగా..

ఐడియా అదిరింది గురూ.. మాస్కుల్లో ముఖం స్పష్టంగా..
X

కరోనా మహమ్మారికి భయపడి ఊరంతా ఏంటి.. ప్రపంచమంతా మాస్కులు కట్టుకుని ముఖం దాచేసుకుంటోంది. మరి అలా మాస్క్ ధరించిన ముసుగు వీరులను గుర్తుపట్టడం కూడా కాస్త కష్టంగానే మారింది. బావున్నారా సుబ్బారావు గారూ అంటూ పక్క ఫ్లాట్ అతను దగ్గరకొచ్చి పలకరిస్తే తప్ప గుర్తుపట్టలేని పరిస్థితి. కరోనాతో కలిసి జీవించాలి.. మాస్కులు మస్ట్‌గా పెట్టుకోవాలి అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఇలాగే కొనసాగుతుందా అంటే.. అబ్బే అవసరం లేదండి.. నేనో బ్రహ్మాండమైనా ఐడియా తీసుకొచ్చాను మీ క్కూడా చెబుతాను ఓ రూ.60 కొడితే అంటున్నారు కేరళకు చెందిన డిజిటల్ ఫొటోగ్రాఫర్ బినేశ్ పాల్.

కేరళలోని కొట్టాయం ప్రాంతంలోని ఎట్టుమన్నూరుకు చెందిన బినేశ్ పాల్ అనే ఓ డిజటల్ ఫోటోగ్రాఫర్ వెరైటీ ఫేస్ మాస్కులు తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. అవే ఫోటో ఫేస్ మాస్కులు. మన ముక్కు, నోరు, చెంపల కలబోతతో ఉండే ఫోటో మాస్క్‌లను ధరించడం వల్ల మనమెవరమో సులభంగా గుర్తుపట్టొచ్చు. ఇప్పటికే మార్కెట్లో పలు రకాల మాస్కులు అవతరించాయి. రానున్న రోజుల్లో మాస్కుల వ్యాపారం జోరందుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

టామ్ అండ్ జెర్రీ, మిక్కీమౌస్, డోరా,చోటా భీమ్, టెడ్డీ బెర్రీ, సినిమా తారలు, జంతువుల బొమ్మలు ఇంకా చాలానే వస్తున్నాయి. ఇవన్నీ ఎందుక్కానీ మన ముఖమే మనకి ఉంటే గుర్తుపట్టడం ఈజీ అవుతుందని ఇలా ఆలోచించానంటున్నారు బినేశ్ పాల్. అయినా మన ప్రధాని మోదీజీ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టమంటూ ప్రోత్సహిస్తుంటారు కదా. ఇదే అవకాశంగా భావించి మాస్క్‌ను డిజైన్ చేశానని చెప్పారు.

మాస్క్ తయారీ విధానాన్ని వివరిస్తూ.. ముందుగా ఏ వ్యక్తికి మాస్క్ కావాలో అతని ఫోటోను హైరిజల్యూషన్ కెమెరాతో తీస్తారు. ఆ తర్వాత అతని ఫోటోను ఓ పేపర్ మీద ప్రింట్ చేసి ఆ తర్వాత ఓ కాటన్ క్లాత్ మీద ముద్రిస్తారు. అతడి ఫేస్ గుర్తు పట్టే విధంగా మెజర్స్ తీసుకుని అధిక ఉష్ణోగ్రత వద్ద జాగ్రత్తగా ఫోటోను కత్తిరిస్తాము అని చెప్పారు. ఈ ఫోటో మాస్క్‌లను తయారు చేయడానికి కేవలం 20 నిమిషాలు సరిపోతుందని.. దీన్ని రూ.60లకు విక్రయిస్తూ ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తున్నామని అన్నారు. మొదట రూ.1000 మాస్కులకు ఆర్డర్ వచ్చింది. రెండు రోజుల్లోనే మరో రూ.5000 మాస్క్‌లకు ఆర్డర్ వచ్చిందన్నారు. కరోనా ఇంకెన్ని కొత్త ఐడియాలను తీసుకొస్తుందో చూడాలి.

Tags

Next Story