ప్రారంభానికి సిద్ధమైన కొండపోచమ్మ రిజర్వాయర్

ప్రారంభానికి సిద్ధమైన కొండపోచమ్మ రిజర్వాయర్

కొండపోచమ్మ రిజర్వాయర్.. ప్రారంభానికి సిద్ధమైంది. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. దాదాపు 16 వందల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఐదు జిల్లాల పరిధిలోని 2 లక్షల 85 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు తప్పుతాయి. రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు 4 వేల 700 ఎకరాలను సేకరించారు. ఈ నెల 29వ తేదీన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను CM కేసీఆర్ ప్రారంభిస్తారు. వ్యవసాయాన్ని పండగలా చేసే ప్రయత్నంలో భాగంగా.. సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్‌పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు హరీష్. తర్వాత నియంత్రిత పంటల సాగు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుబంధు వంటి పథకాలతో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. త్వరలోనే రుణమాఫీ నిధులు కూడా విడుదల చేస్తామని తెలిపారు. వానాకాలం మొక్కజొన్నలు పండిస్తే నష్టం వస్తుంది కాబట్టి కంది పంటను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. యువకులు ఫేస్ బుక్కులు, పబ్జి గేములు మానేసి, సాగులో తల్లిదండ్రులకు సహకరించాలని సూచించారు హరీష్.

Tags

Read MoreRead Less
Next Story