యమునా నది ఎంత స్వచ్ఛంగా.. కరోనా వచ్చి..

నదులన్నీ తలారా స్నానం చేసినట్లు ఒడ్డున సేద తీరుతున్నాయి. నిశ్ఛలమైన మనస్సుతో స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు రెండు నెలల లాక్డౌన్‌తో నదుల రూపు రేఖలు మారిపోయాయి. యమునా, గంగా, గోదారి తమ అందానికి తామే సిగ్గుపడుతున్నాయి. అంత అందంగా ఆనందంగా ప్రవహించడానికి కరోనాయే కారణమని తెలిసి వైరస్‌కి వందనాలర్పిస్తున్నాయి.
జీవనదుల్ని ఏదో విధంగా కలుషితం చేస్తున్నాడు మానవుడు. స్వచ్ఛతను కోల్పోయిన నదుల రూపు రేఖలు మారుస్తాము.. ఇన్ని కోట్లు ఖర్చవుతాయి.. అని ప్రణాళికలు రచించడంతోనే ప్రభుత్వాలు మారిపోతున్నాయి. వారు చేసిన వాగ్ధానాలు అలానే మిగిలిపోతున్నాయి. దాదాపు రెండు నెలల లాక్డౌన్‌తో నరనాధుడూ నదుల వంక చూడకపోవడంతో వాటికవే శుభ్రపరచుకున్నాయి. స్వచ్ఛంగా మారిపోయాయి. నదుల్లో ప్రవహించే జంతు జాలాన్ని, మృత కళేబరాలను వలస పక్షులు ఆరగించడంతో చెత్తా చెదారం లేకుండా క్లీన్ అయిపోయాయి నదులన్నీ.
ఇక యమున విషయానికి వస్తే.. దాదాపు 1400 కి.మీ పొడవుండే యమునా నది ఏడు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. నది ఒడ్డున ఉండే కాలనీల మురుగు నీరు, కర్మాగారాల నుంచి వెలువడే రసాయనాలు అందులోకి వచ్చి చేరుతుంటాయి. హరియాణాలోని పానిపట్, దిల్లీ మధ్య ఉన్న దాదాపు 300 ఫ్యాక్టరీల నుంచి వ్యర్ధాలు వచ్చి నదిలో కలుస్తాయి. దీంతో దేశంలోనే అత్యంత కాలుష్యమైన నదిగా యమునా నది నిలిచింది. అయితే లాక్డౌన్ కారణంగా క్రితంతో పోలిస్తే దిల్లీ ప్రాంతంలో నది 33 శాతం స్వచ్ఛతను సంతరించుకుందని దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ పేర్కొంది.
గత 30 ఏళ్లలో యమునా నదిని ఎప్పుడూ ఇంత స్వచ్ఛంగా చూడలేదని యమునా యాక్షన్ ప్లాన్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ స్వచ్ఛతను ఇలాగే కొనసాగించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని యాక్షన్ ప్లాన్ సభ్యులు సూచించారు. వ్యర్ధాలు నదిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. రెండు నెలల అనంతరం జన సందడి మొదలవడంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే నదులు మళ్లీ యధా ప్రకారం మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాలు ఆదిశగా చర్యలు చేపట్టాలని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com