ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

ఈ నెలాఖరుతో కేంద్రం విధించిన లాక్‌డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కూడా కొన్నాళ్లపాటు సడలింపులే తప్ప పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి, గ్రేటర్‌లో పెరుగుతున్న కేసుల కట్టడికి ఏం చేయాలి అనే దానిపై KCR ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో CM కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరగనుంది. ప్రస్తుతం దుకాణాలు తెరిచేందుకు అమలు చేస్తున్న సరి, బేసి విధానం మరికొన్నాళ్లు కొనసాగించాలా, GHMC పరిధిలో సిటీ బస్సులు ఎప్పటి నుంచి నడపాలి అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే మెట్రో సర్వీసుల పునరుద్ధరణపై కూడా చర్చించనున్నారు. రెస్టారెంట్లు వంటి వాటికి అనుమతులు ఇవ్వడంపైనా అందరితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కోవిడ్ తర్వాత నియంత్రిత పంటల సాగు అంశంపై ప్రధానంగా ఫోకస్ చేస్తారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే అంతా ఒకే పంట సాగు చేయకుండా ప్రణాళిక మార్చుకోవాలని KCR ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ సీజన్‌లో వర్షాలు పడిన వెంటనే వ్యవసాయ పనులు జోరందుకుంటాయి కాబట్టి.. ఏయే ప్రాంతంలో ఏ పంటలు సాగు చేయాలనే దానిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో రైతులు KCR చెప్పినట్టు నియంత్రిత పంటల సాగుకు ఒప్పుకుంటూ, ప్రభుత్వం సూచించిన పంటలే వేస్తామంటూ తీర్మానాలు కూడా చేశారు. అటు, ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూసేందుకు ఏం చేయాలనే దానిపైనా అధికారులతో చర్చించనున్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకల నిర్వహణపై కూడా సమీక్షించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com