కమలం నేతల లాజిక్.. జీవో 888 ద్వారా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారా?

కమలం నేతల లాజిక్.. జీవో 888 ద్వారా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారా?
X

తిరుమల ఆస్తుల వివాదంపై బీజేపీ గేర్ మార్చింది. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతోంది. భక్తులు స్వామివారికి సమర్పించుకున్న ఆస్తులను ఎలా వేలం వేస్తారంటూ మండిపడుతోంది. అయితే..ఆస్తుల వేలాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసినా..అందులోని లొసుగులను వెలుగులోకి తీసుకొస్తూ ప్రభుత్వంపై వార్ కంటిన్యూ చేస్తోంది బీజేపీ. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 888 ముమ్మాటికి మోసపూరిత జీవో అన్నది బీజేపీ వాదన. 2016లో అప్పటి టీటీడీ బోర్డు ఇచ్చిన 256 తీర్మానాన్ని రద్దు చేస్తూ ప్రస్తుత 888 జీవో ఇచ్చారని అంటోంది. కానీ, తమిళనాడులోని 23 ఆస్తుల వేలానికి సంబంధించి ప్రస్తుత టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు బీజేపీ నేతలు. దీంతో మళ్లీ వేలానికి అవకాశం ఉన్నట్లేనన్నది కమలం నేతల లాజిక్.

శ్రీవారి ఆస్తుల వేలానికి వ్యతిరేకంగా బీజేపీ- జనసేన చేపట్టిన దీక్షలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జీవో 39 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో గజం భూమి కూడా వేలం వేయబోమని హామీ ఇవ్వాలన్నారు. అలాగే సింహాచలం భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కన్నా.

ఆలయ భూములకు భద్రత కల్పించాలని.. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ డిమాండ్ చేశారు. టీటీడీ భూములు కాపాడాలంటే.. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీలో ఉపవాస దీక్ష చేపట్టారు. భవిష్యత్తులో ఆలయాల ఆస్తులు అమ్మకుండా ఆర్డినెన్స్‌ తేవాలన్నారు జీవీఎల్‌. ఆలయ భూములు అమ్మే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండకూడదన్నారు.

మరోవైపు టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారం హైకోర్టుకు చేరింది. స్వామివారి ఆస్తులను వేలం వేయాలన్న టీటీడీ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రజా ప్రయోజనాల పిటీషన్ దాఖలయ్యింది. భవిష్యత్తులో టీటీడీ ఆస్తులు వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోరారు. టీటీడీ ఆస్తులను కాపాడాటానికి జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు. బుధవారం విచారణ చేపట్టనుంది.

టీటీడీ ఆస్తుల వివాదం రాజుకున్న ప్రస్తతం నేపథ్యంలో తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్వామి వారి ఆస్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలేశుడి ఆస్తులు, ఆభరణాలపై పూర్తి ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వం నాటి నుంచి ఇప్పటివరకు టీటీడీ ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, ఆభరణాలపై జాతీయ స్థాయిలో స్పష్టమైన ఆడిట్ జరగాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి ట్వీట్ చేశారు రమణ దీక్షితులు.

Tags

Next Story