విగతజీవిగా బయటకు వచ్చిన బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

విగతజీవిగా బయటకు వచ్చిన బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

12 గంటల శ్రమ, తల్లిదండ్రుల ఆవేదన, అధికారుల పట్టుదల, గ్రామస్తుల ఆకాంక్ష.. ఇవేవీ బాలుణ్ని బతికించలేకపోయాయి. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సాయివర్ధన్‌ చివరకు విగతజీవిగా కూపం నుంచి బయటకు వచ్చాడు. 12 గంటలపాటు శ్రమించిన సహాయక బృందాలు చివరకు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశాయి.

రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి.. హైదరాబాద్‌ నుంచి రెస్క్యూ బృందాలు వెళ్లాక రెస్క్యూ ఆపరేషన్‌ మరింత ముమ్మరంగా సాగింది.. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్విన అధికారులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.. 17 అడుగుల లోతులో బాలుడి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.. అయితే, బాలుడిపై మట్టిపెళ్లలు పడి ఉండటాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గుర్తించాయి.. విపరీతమైన వేడితోపాటు మట్టిపెళ్లలు పడటం వల్లే చిన్నారి మృతిచెంది ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

బుధవారం సాయంత్రం సమయంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు.. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. అప్రమత్తమైన పోలీసులు, స్థానిక ఎమ్మార్వో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఆ వెంటనే జిల్లా కలెక్టర్‌ సహా ఇతర అధికారులంతా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.. మంత్రి హరీష్‌రావు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూనే ఉన్నారు.. ఇక పద్మాదేవేందర్‌ రెడ్డి కూడా ఘటనా స్థలానికి వెళ్లి రాత్రంతా అక్కడే ఉన్నారు. స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారు.

తక్కువ లోతులోనే బాలుడు పడిపోయినట్లు ముందుగానే గుర్తించిన అధికారులు.. బాలుణ్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డారు.. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల వెడల్పుతో తవ్వకాలు జరిపారు.. అయితే, అప్పటికే అధునాతన టెక్నాలజీ ద్వారా బాలుడి కదలికలు గుర్తించే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు.. బాలుడి కదలికలు, యోగక్షేమాలు తెలియక తల్లిదండ్రుల్లో ఆందోళన కనిపించింది.. ఆ ఆందోళన చివరకు విషాదంగా మారుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

బాలుడి సాయివర్ధన్‌ మృతితో పోడ్చన్‌పల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి.. దేవుడు కరుణిస్తాడు.. బాలుడు క్షేమంగా బయటకు వస్తుందన్న ఆశలు ఆవిరవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన చెప్పనలవి కాకుండా ఉంది. విగతజీవిగా మారిన బిడ్డను చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.. బిడ్డ కోసం వారు పడ్డ రోదన చూసి ప్రతి ఒక్కరి హృదయం బాధతో బరువెక్కింది.

Tags

Next Story