ఎంత మంచి యజమాని.. కూలీలకు విమాన టిక్కెట్లు బుక్ చేసి..

రెక్కాడితేగాని డొక్కాడని వలస కూలీలు వారు. విమానంలో ప్రయాణం చేస్తామని కలలో కూడా ఊహించి ఉండరు. బిహార్‌లోని సమస్తీపూర్ వారి గ్రామం. లాక్డౌన్ కారణంగా రెండు నెలల నుంచి రాజధాని దిల్లీలోనే ఉండిపోయారు. పుట్టగొడుగులు పండించే రైతు పప్పన్ సింగ్ కూలీలను వారి స్వస్థలాలకు విమానంలో పంపిస్తున్నారు. ఆయన దగ్గర 27 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని 50 ఏళ్ల లఖిందర్ చెప్పాడు. తనతో పాటు తన కుమారుడు నవీన్ రామ్ ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామన్నాడు.
నేను విమానంలో ప్రయాణిస్తానని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఇదే విషయం నా భార్యకు చెబితే ఆమె కూడా ఆశ్చర్యపోయింది. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి మా యజమానే మాకు ఆహారం వసతి ఏర్పాటు చేశారని.. ఇప్పుడు రూ.68,000 విలువైన విమాన టిక్కెట్లను బుక్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి రూ.3,000 నగదును కూడా ఇస్తున్నారు. మా రాష్ట్రానికి వెళ్లాక మేము ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఈ డబ్బు ఇస్తున్నారని చెప్పాడు.
సామాజిక దూరాన్ని పాటిస్తూ యజమాని తన సొంత వాహనంలో అందరినీ విమానాశ్రయానికి చేర్చారు. నాదగ్గర పని చేసే కూలీలు కాలి నడకన ప్రయాణించి ప్రాణాలు కోల్పోకూడదని అందుకే ఇలా చేసానని చెప్పారు పప్పన్. వారు సురక్షితంగా ప్రయాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పారు. యజమాని తమ పట్ల చూపిస్తున్నకృతజ్ఞతకు ధన్యవాదాలు చెప్పారు కార్మికులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com