లక్షల సంఖ్యలో విరుచుకుపడుతూ.. తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసిన మిడతల దండు

లక్షల సంఖ్యలో విరుచుకుపడుతూ.. తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసిన మిడతల దండు
X

ఇప్పుడంతా క్రిమికీటకాలదే రాజ్యమైపోతోంది. వైరస్‌లు, కీటకాలు ప్రజలపై వరుసగా పంజా విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఇప్పుడు మిడతల గొడవ వచ్చి పడింది. మిడతలు దండుగా దాడి చేస్తున్నాయి. వందలు, వేలు కాదు, లక్షల సంఖ్యలో విరుచుకుపడుతున్నాయి. పొలాలపై దాడి చేస్తూ పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన మిడతల దండు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసింది. రాజస్థాన్ మీదుగా మహారాష్ట్రకు చేరిన మిడతలు, అమరావతిలో తిష్ట వేశాయి. అక్కడి అధికారులు మిడతలను తరిమివేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించి ఆ మిడతలు ఛత్తీస్‌గడ్‌ మీదుగా తరలిపోతే ఇబ్బంది ఉండదు. లేకపోతే తెలంగాణ జిల్లాలకు సమస్య తప్పదు. ముఖ్యంగా, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు మిడతల ముప్పు పొంచి ఉంది. దాంతో, ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమ య్యారు. వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి నిపుణులతో సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మిడతల నివారణకు జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో రసాయనాలు సిద్దం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

వాస్తవానికి మనకు మిడతలు కొత్తేమీ కాదు. కాకపోతే ఇంత పెద్ద సంఖ్యలో మిడతల దండు చేయడం మాత్రం గత 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చీడ పీడల నివారణలో కొత్త పద్ధతుల కారణంగా 2011 డిసెంబర్ నుంచి మనదేశంలో మిడతల ప్రభావం పెద్దగా లేదు. మళ్లీ 27 ఏళ్ల తర్వాత వాటి ఉద్ధృతి పెరిగి ప్రమాదకరంగా మారింది. రాజస్థాన్ నుంచి మొదలుపెట్టి గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వరకు విస్తరించాయి. రాజస్థాన్‌ అంతటా మిడతలు చాపలా పరుచుకున్నాయి. ఇళ్లు, వీధులు, పంట పొలాలు.. ఇలా ప్రతి ప్రాంతాన్ని మిడతలు ఆక్రమించేశాయి.

2018 మేలో దక్షిణ అరేబియాలోని రుబ్‌ అల్‌ ఖలీ ఎడారిలో మెకున్‌ తుఫాన్‌ ప్రయాణించింది. ఆ టైమ్‌లో ఎడారిలో అక్కడక్కడా తాత్కాలిక నీటి చెలమలు ఏర్పడ్డాయి. ఎడారి మిడతలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడానికి ఆ చెల మలు అనుకూలమైన వాతావరణం కల్పించాయి. 2018 అక్టోబరులో లుబాన్‌ తుఫాన్‌ రావడంతో వాటి పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కేవలం 9 నెలల్లో 8 వేల రెట్లకు పైగా పెరిగిపోయిన మిడతలు, అక్కడి నుంచి దండయాత్ర ప్రారంభించాయి. సౌదీ నుంచి ఇరాన్‌, పాకిస్థాన్‌లోకి ప్రవేశించి అక్కడి పంటపొలాలను సర్వనాశనం చే శాయి. ఏప్రిల్‌ రెండో వారంలో మనదేశంలోకి మిడతల తుఫాన్ ప్రవేశించింది. రాజస్థాన్‌లో 18 జిల్లాలు మిడతల బారిన పడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని 17 జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ది కూడా ఇదే పరిస్థితి.

జూన్, జూలైలో మిడతల బెడద మరింత పెరగనుంది. జూన్‌లోగా దేశంలోకి వచ్చిన మిడతల సంఖ్య 400 రెట్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇరాన్, పాకిస్థాన్లలోని మిడతలు సంతానాన్ని వృద్ధి చేసుకునే కాలం కావడంతో జూలైలో సిచ్యువేషన్ మరింత డేంజరస్‌గా మారుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే చాలా రాష్ట్రాలు దెబ్బతింటాయి. మిడతల కారణంగా దేశంలో వేలాది కోట్ల మేర పంట నష్టం వాటిల్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story