తెలంగాణలో మరో అపూర్వ దృశ్యం

తెలంగాణలో మరో అపూర్వ దృశ్యం

గోదావరి జలాలను అరకిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న సీఎం కేసీఆర్‌ కల సాకారమయ్యే క్షణం సమీపించింది. కొండపోచమ్మ జలాశయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ఎత్తయిన ప్రాంతం ఇదే. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. మేడిగడ్డ నుంచి వచ్చే జలాలు దాదాపు అర కిలోమీటరు మేర పైకి వచ్చి కొండపోచమ్మ జలాశయంలోకి చేరనున్నాయి. ఈ జలాశయం ద్వారా సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. త్రిదండి చినజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ ఈ జలాశయాన్ని ఈ ఉదయం 11.30 గంటల సమయంలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం, మర్కూక్‌ పంపుహౌస్‌ వద్ద సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో సీఎం కేసీఆర్‌ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు మంత్రి హరీష్‌ రావు. సాగు, తాగునీటి సమస్యకు ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపెడుతుందని తెలిపారు. వందల కిలోమీటర్ల దూరంలో పారే గోదావరిని 618 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టులో చివరి దశ కొండపోచమ్మ ప్రాజెక్టు అన్నారు. ప్రారంభోత్సవానికి సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్తు ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లను ఆహ్వానించినట్లు తెలిపారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన నాయకులను పరిమిత సంఖ్యలో ఆహ్వానించామన్నారు. పండగ వాతావరణంలో లక్షలాది మందితో నిర్వహించాలనుకున్నా లాక్‌డౌన్‌ వల్ల సాదాసీదాగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహ్వానితులే కార్యక్రమానికి హాజరుకావాలని, ప్రజలు ఎవరూ రావొద్దని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story