మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తొలగింపు వివాదం.. హైకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తొలగింపు వివాదంపై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన ఈ కేసులో వాదనలు ప్రారంభమైన తొలి రోజు నుంచే ఆసక్తికర ట్విస్టులు చోటు చేసుకున్నాయి. సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా.. 243K ఆర్టికల్ ను పట్టించుకోకుండా ప్రభుత్వం తనను తొలగించింది అనేది మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ వాదన. ఈ కేసులో ప్రభుత్వ ఆర్డినెన్స్ రు రద్దు చేయాలంటూ నిమ్మగడ్డ తో పాటు మరో 11 మంది పిటీషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 11న నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎస్ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ పై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేపట్టింది హైకోర్టు. ఏప్రిల్ 13న విచారణ ప్రారంభించింది. అయితే..బాధితుడు నిమ్మగడ్డ నేరుగా కోర్టును ఆశ్రయించటంతో మిగిలిన పిటీషన్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వాదించింది. కానీ, ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కావటంతో తమ పిటీషన్లను కూడా పరిగణలోకి తీసుకొని వాదనలను వినాలని మిగిలిన వారు అభ్యర్ధించారు. దీంతో అందరి పిటీషన్లను పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టింది. అయితే..కౌంటర్ దాఖలుకు నెల రోజుల సమయం కోరింది ప్రభుత్వం. కానీ, హైకోర్టు అందుకు అనుమతించలేదు. ఏప్రిల్ 16 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే..ప్రభుత్వం మాత్రం రెండు రోజులు ఆలస్యంగా ఏప్రిల్ 18న కౌంటర్ దాఖలు చేసింది.
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయటంతో ఏప్రిల్ 20న విచారణ చేపట్టింది హైకోర్టు. అయితే..ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. ఏప్రిల్ 18న దాఖలు చేసింది కేవలం ప్రాథమిక కౌంటర్ అని..పూర్తి స్థాయి కౌంటర్ కు గడువు కోరింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు..తగిన సిబ్బంది లేరన్న ఏజీ వాదనను తప్పుబట్టింది. అయినా ఏజీ హోదాకు గౌరవం ఇస్తూ అదనపు కౌంటర్ దాఖలు చేయటానికి గడువు ఇచ్చింది. ఏప్రిల్ 24లోగా ప్రభుత్వం అడిషనల్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఏప్రిల్ 27లోగా పిటిషనర్లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ..విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.
ఏప్రిల్ 28న విచారణ చేపట్టడంతో..వాదనలు వినిపించిన పిటీషనర్లు ప్రభుత్వ ఆర్డినెన్స్ కేవలం కక్షసాధింపులో భాగమేనన్నారు. 243k సర్వీస్ రూల్స్ నిబంధనల మేరకు ఎస్ఈసీ పదవీకి రాజ్యంగ రక్షణ ఉందన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ చెల్లదని వాదనలు వినిపించారు. అయితే..ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణలో స్వతంత్రత పెంచేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని..ఎన్నికల కమిషనర్ పై రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదనేది తమ అభిమతమని చెప్పుకొచ్చింది. విచారణ సందర్భంలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పంచాయితీ రాజ్ శాఖ చట్టంలో మార్పులు మాత్రమే సూచిస్తుందని వ్యాఖ్యానించింది. మున్సిపల్ చట్టంలో మార్పులు చేయలేదు కదా అని ప్రశ్నించింది. అంటే మున్సిపల్ చట్టం ప్రకారం నిమ్మగడ్డ పదవీకాలం ఇంకా ముగిసి పోలేదు కదా అని ప్రశ్నించింది.
ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ఈ నెల 8న ముగిశాయి. విచారణ ముగియటంతో రాత పూర్వక వివరణ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎస్ఈసీ కనగరాజ్ తరపు న్యాయవాది మాజీ ఏజీ సీవీ మోహన్ రెడ్డి కోరారు. కోర్టు అనుమతి ఇవ్వటంతో ఈ నెల 11న ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. దీంతో ఈ కేసులో వాదనలు పూర్తి అయ్యాయి. ఇక హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనేది సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com