మోదీతో అమిత్ షా భేటీ.. మే 31 తర్వాత లాక్‌డౌన్ 5.0 ఉంటుందా?

ఇప్పటికే నాలుగు లాక్‌డౌన్‌లు.. కఠిన ఆంక్షలు కొనసాగినప్పటికీ.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ప్రధాని నివాసానికి వెళ్లిన అమిత్ షా.. కరోనా తీవ్రత, లాక్‌డౌన్ తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. గత రెండు రోజులుగా.. అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాలతో సీఎంలతో ఫోన్లలో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. లాక్‌డౌన్, కరోనా పరిస్థితులపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను మోదీకి అమిత్ షా వివరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగింపా.. లేదా అన్నది దాదాపు నేడు తేలే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై.. గత కొన్ని రోజులుగా.. ప్రధాని కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తోంది. అయితే.. ప్రతి లాక్‌డౌన్ కొనసాగింపునకు ముందు.. నేరుగా ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలు, అక్కడి పరిస్థితులు తెలుసుకునేవారు. కానీ ఈ సారి మాత్రం.. అమిత్ షా ఆ బాధ్యతను పూర్తిచేయడం విశేషం.
మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి దశ లాక్‌డౌన్ కొనసాగింది. ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు రెండో దశ లాక్‌డౌన్ కొనసాగింది. మే 4 నుంచి మే 17 వరకు మూడో దశ లాక్‌డౌన్ విధించారు. మే 18న ప్రారంభమైన నాలుగో విడత లాక్‌డౌన్ రేపటి వరకు కొనసాగనుంది. గత లాక్‌డౌన్‌లో అనేక సడలింపులను ఇచ్చారు. జోన్ల విషయంలోనూ.. .కేసుల తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాలకు సడలింపుల అధికారాలు ఇచ్చారు. వాటికి అనుగుణంగానే.. రాష్ట్రాలు సడలింపులు ఇస్తూ వెళ్లాయి. మే 1 నుంచి వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్లు నడిపారు. ఆ తర్వాత రాష్ట్రాల ఆదాయాల కోసం మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు రాష్ట్రాల్లో బస్సు సర్వీసులను ప్రారంభించారు. సడలింపులో భాగంగా... మే 25 నుంచి దేశీయ విమానయాన సర్వీసులు మొదలయ్యాయి. ఇక జూన్ 1 నుంచి పరిమిత సంఖ్యలో రైల్వే ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి.
లాక్‌డౌన్ 4 లో పలు ఆంక్షలు కొనసాగాయి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, మతపరమైన కార్యక్రమాలు, విద్యా సంస్థలు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్లు వంటి వాటిపై నిషేధం కొనసాగింది. అయితే.. మరి ఐదో దశ లాక్‌డౌన్ ఉంటే వాటిపై ఎలా నిర్ణయం రాబోతున్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసేందుకు మరిన్ని సడలింపులు ఉంటాయని భావిస్తున్నారు. ఓ వైపు 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వంటి ప్యాకేజీలు ప్రకటించినప్పటికీ.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే కానీ.. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడేలా కనిపించడంలేదు.
కేంద్రం ఐదో విడత లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు కొనసాగించే అవకాశం ఉందని.. గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను తీసేయాలని కోరుతున్నాయి. ఐదో విడత లాక్‌డౌన్ సడలింపులపై కేంద్రం ఓ నిర్ణయానికి రాకముందే.. కర్నాటక, బెంగాల్ రాష్ట్రాలు ఓ అడుగు ముందేశాయి. కేంద్ర అనుమతితో జూన్ 1 నుంచి ఆలయాలు తెరుస్తామని కర్నాటక తెలిపింది. అటు బెంగాల్ కూడా.. అన్ని మతాల ప్రార్థనా స్థలాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. పది మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. నాలుగో లాక్‌డౌన్‌లో దేశంలో కరోనా మరింత విజృంభిస్తున్న పరిస్థితుల్లో... సడలింపులతో కూడిన లాక్‌డౌన్ ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రతను బట్టి... సడలింపుల అధికారం వారికే ఇవ్వ వచ్చని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com