పొట్టకూటికోసం వెళ్లిన వలసకార్మికుడి జీవితం మధ్యలోనే ముగిసింది..

పొట్టకూటికోసం స్వరాష్ట్రం నుంచి మరోరాష్ట్రం వెళ్లిన వలసకార్మికుడి జీవితం మధ్యలోనే ముగిసింది. సొంతవూరికి చేరుకోకుండానే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని సోరో సమీపంలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన 60 ఏళ్ల హయార్ మొహమాద్ అనే వలస కార్మికుడు హైదరాబాద్ లో కూలి పని చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో పశ్చిమ బెంగాల్ కు కాలినడకన తన మేనల్లుడితో కలిసి బయలుదేరాడు. వారు ఐదు రోజుల క్రితం తమ ప్రయాణాన్ని ప్రారంభించారు, గురువారం రాత్రి సోరో చేరుకున్నారు..
ఈ క్రమంలో 16వ జాతీయ రహదారి సమీపంలో మూసివేసిన దుకాణం వరండాలో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే, ఉదయం మేనల్లుడు లేచి చూసేసరికి హయార్ ఉలుకూపలుకు లేకుండా పడి ఉన్నాడు. దాంతో అతను పోలీసులను సంప్రదించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హయార్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com