ఏపీలో మరో ఆలయ వివాదం

ఏపీలో మరో ఆలయ వివాదం
X

హిందూ దేవాలయాల పట్ల ఏపీ సర్కారు అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీవారి భూములను అమ్మకానికి పెట్టి దేశ ప్రజల నుంచి ఛీత్కారాలు కొట్టించుకుంది. దెబ్బకు దిగివచ్చి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది జగన్ సర్కారు. ఈ వివాదం పూర్తిగా సద్దుమణగక ముందే మరో వివాదానికి అధికారులు తెరతీశారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం కట్టిన మున్సిపల్ స్కూలుకు మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. కానీ ఎక్కడా స్థలం లేనట్లు పవిత్ర శివాలయం ముందే నిర్మించాలని ప్లాన్ రెడీ చేశారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ అధికారుల అరాచకం ఇది. మున్సిపల్ స్కూలుకు మరుగుదొడ్లు నిర్మిస్తామంటూ శివాలయం భూమిలో కొలతలు తీసుకున్నారు. ఇది గమనించిన పరమశివుడి భక్తులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఆలయం వద్ద మరుగుదొడ్లు నిర్మించి అపవిత్రం చేయడమేంటని నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు.

మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు తాత శివాలయానికి ఎకరం భూమి ఇచ్చారు. ఇదే స్థలంలో స్కూలు కోసం మరుగుదొడ్లు నిర్మించాలని మున్సిపల్ అధికారులు భావించడంపై తీవ్ర దుమారం రేగింది. అయితే ఇది అధికారుల నిర్ణయం కాదని.. వైసీపీ పాలకుల నిర్ణయమని ఈశ్వరుడి భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు మంచివి కావని హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story