70 మంది కూర్చునే పడవ ఆమె ఒక్కదాని కోసం..

70 మంది కూర్చునే పడవ ఆమె ఒక్కదాని కోసం..
X

ఓ ఇంటర్ విద్యార్థిని పరీక్షలు రాయాలంటే నదిని దాటాలి. అందుకోసం పడవ ఎక్కి వెళ్లాలి. ఆమె ఒక్కదాని కోసమే 70 మంది కూర్చునే పడవను ఏర్పాటు చేసింది కేరళ రాష్ట్ర నీటి సరఫరా సంస్థ. కేరళలోని అలప్పూజ జిల్లా ఎమ్ఎన్ బ్లాక్ ప్రాంతానికి చెందిన సాండ్రా అనే అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ సడలింపులతో వాయిదా పడ్డ పరీక్షలు జరిగే సమయం వచ్చింది. అయితే సాండ్రాకు స్కూలుకు వెళ్లేందుకు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. తనకు సొంత వాహనం ఏర్పాటు చేసుకునేంత ఆర్థిక స్థోమత కూడా లేదు.

కానీ పరీక్షలు రాయాలనే పట్టుదల ఆమెను ముందుకు నడిపించింది. తన పరిస్థితిని వివరిస్తూ ఆమె కేరళ రాష్ట్ర నీటి సరఫరా సంస్థకు లేఖ రాసింది. వారికి తన దుస్థితి వివరించింది. సాండ్రా అభ్యర్థనను స్వీకరించిన ఎస్‌డబ్ల్యూటీడీ ఆమె కోసం ప్రత్యేకంగా ఓ పడవను ఏర్పాటు చేసింది. శుక్రవారం, శనివారం జరిగిన పరీక్షల కోసం ఆమెను కొట్టాయంలోని కంజిరామ్ వరకు తీసుకెళ్లి పరీక్ష అయిపోయేంతవరకు అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకొచ్చేవారు. ఇలా సాండ్రా ఒక్కదాని కోసం పడవను ఏర్పాటు చేసినందుకు ఎస్‌డబ్ల్యూటీడీ ప్రశంసలందుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే తాము ఈ పని చేయగలిగామని అంటోంది రాష్ట్ర నీటి సరఫరా సంస్థ.

Tags

Next Story