అమల్లోకి లాక్‌డౌన్ 5.0.. చెక్‌పోస్ట్‌ల వద్ద సడలింపులు ఇవ్వని ఏపీ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి లాక్‌డౌన్-5 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి విషయంలో కేంద్రం సూచనల ప్రకారం.. సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద ఆంక్షలు ఎత్తేసింది తెలంగాణ ప్రభుత్వం. ఐతే.. ఏపీ బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద మాత్రం షరతులతోనే ప్రయాణికుల్ని అనుమతిస్తున్నారు. స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్‌లు తీసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తామని DGP స్పష్టం చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి బోర్డర్ చెక్‌పోస్టుల్లో పరీక్షలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. పరీక్షల్లో నెగిటివ్ వస్తే 14 రోజులు హోమ్‌క్వారంటైన్లో ఉండాలని, పాజిటివ్ వస్తే ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అక్కడ పరీక్షలు చేసేందుకు సమయం పడుతుంది కాబట్టి అంతా సహకరించాలని కోరింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకూ ఆంక్షల్ని కొనసాగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
కేంద్రం అంతర్రాష్ట్ర రాకపోకలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే.. ఏపీ బోర్డర్ విషయంలో ఆంక్షలు ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు పడుతున్నారు. వైద్యపరీక్షలకు, హోంక్వారంటైన్‌లో ఉండేందుకు కూడా సిద్ధమై కొందరు ప్రయాణాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు కూడా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలు, బస్సు సర్వీస్‌లను కూడా ప్రారంభించాలని కోరుతున్నారు. ఐతే.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే కొన్ని ఆంక్షలు తప్పవని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న లక్షలాది మంది ఇంకా సొంత ఊళ్లకు చేరేందుకు నానా కష్టాలు పడుతున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం తప్ప పూర్తి స్థాయిలో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇవ్వలేమని అధికారులు వివరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 5వ దశ లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకూ కంటైన్మెంట్ ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారు. మిగతా చోట్ల జూన్ 7 తర్వాత మరిన్ని సడలింపులు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతానికైతే ఇతర రాష్ట్రాలకు రాకపోకలపై నిషేధం ఎత్తేసినట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. అలాగే రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉంటుంది. దుకాణాలు రాత్రి 8 గంటల వరకూ తెరిచే వీలు ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com