ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు

కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసే వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జోరందుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 40కిపైగా వ్యాక్సిన్‌లు ప్రయోగ దశకు చేరడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. కరోనా వైరస్‌కు సంబంధించిన జెనిటిక్ డేటాను చైనా విడుదల చేసిన తర్వాత వరల్డ్ వైడ్‌గా పరిశోధనలు చాలా వేగంగా సాగుతున్నాయి. కొన్ని పరిశోధనలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌కు చేరాయి. చైనాలోని హువాయి ప్రావిన్స్‌లో వంద మంది ఆరోగ్యవంతులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు లాన్సెట్ మెడికల్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.
ఇప్పటికే ట్రయల్స్ చేపట్టిన క్యాన్సినో బయోలాజికల్స్ రెండో దశ ట్రయల్స్‌కు రెడీ అవుతున్నట్లు లాన్సెట్ వెల్లడించింది. అయితే ఈ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని పెంచిందిగానీ వైరస్ నుంచి పూర్తి స్థాయిలో కాపాడలేదని స్పష్టమైంది. ఈ టీకా ప్రయోగించినవారిలో 28 రోజుల తర్వాత యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయని, వైరస్ నుంచి రక్షించే టీసెల్స్‌లో ప్రతిస్పందన కనిపించిందని సైంటిస్టులు వెల్లడించారు. అందుకే దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనాకు టీకాను అభివృద్ధి చేయడంలో సక్సెస్ అయినట్లు బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటికే వెయ్యి మందిపై వ్యాక్సిన్‌ను ప్రాథమికంగా ప్రయోగించింది. మరి ఈ టీకా కరోనా వైరస్ నుంచి కాపాడుతుందా? లేదా? అని తేల్చడానికి రెండో దశలో 10 వేల మందిపై ప్రయోగం చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు వృద్ధులు, చిన్నారులపై కూడా పరీక్షించనున్నట్లు సైంటిస్టులు ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ కోసం ఆస్ట్రా జెనెకా ఫార్మా కంపెనీ ఆక్స్‌ఫర్డ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలాగైనా ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకురావాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు పట్టుదలతో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com